New ration cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై నాదెండ్ల మనోహర్ గుడ్‌న్యూస్
రాష్ట్రంలోని మహిళలు సర్కారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పారు.

రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకో గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు అందే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అంతేగాక, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా ఛాన్స్ ఇస్తామని అన్నారు. నెల్లూరు జిల్లాలో పలువురు నేతలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడారు.
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు సర్కారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా దీపం-2 పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని అన్నారు.
నెల్లూరు జిల్లాలో 4 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 93.42 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఈ సంవత్సరం 1.50 కోట్లు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. తెలంగాణలోనూ రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే.