ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ..అర్ధరాత్రి జీవో జారీ

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 06:12 AM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ..అర్ధరాత్రి జీవో జారీ

Updated On : July 31, 2020 / 10:43 AM IST

ఎట్టకేలకు ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను మళ్లీ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం 2020, జులై 31వ తేదీ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట ప్రకటన విడుదల చేశారు.



హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. దీంతో ఆయన నియమాకానికి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు సూచించింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవి పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపింది.

నిమ్మగడ్డ పదవీకాలం కుదింపు, కొత్త కమిషనర్ గ జస్టిస్ కనకరాజును ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దీనిని హైకోర్టు కొట్టివేసింది. తిరిగి రమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ..ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే..హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరినా..సుప్రీం తిరస్కరించింది.



రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిదే. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగాయి. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నామని మార్చి 15న ఎస్ఈసీ రమేష్ కుమార్‌ ప్రకటించారు.

దీనిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. సీఎం జగన్ రమేష్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.



రమేష్ కుమార్ చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారని, ఆ పార్టీకి మేలు చేసేందుకే ఎన్నికలు వాయిదా వేశారని జగన్ తో పాటు మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ మార్చి 18న ఎన్నికల కమిషనర్‌ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.

అప్పటి నుంచి ఆయన కొంతకాలం హైదరాబాద్‌ నుంచే విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ రమేశ్‌ కుమార్‌కు చెక్‌ పెట్టింది. తాజాగా ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమిస్తూ..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది.