No. 23 Fear for TDP : టీడీపీని వెంటాడుతున్న నెంబర్‌ 23 : చంద్రబాబుకు కలిసిరాని 23

23... ఈ నెంబర్‌ వింటేనే టీడీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. ఒకప్పుడు ఎన్డీయే కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ చంద్రబాబుకు 23 నెంబర్‌ అస్సలు కలిసిరావడం లేదు.

No. 23 Fear for TDP : టీడీపీని వెంటాడుతున్న నెంబర్‌ 23 : చంద్రబాబుకు కలిసిరాని 23

No 23 Fear For Tdp There Are Many Reasons For This

Updated On : March 16, 2021 / 4:14 PM IST

No. 23 Fear for TDP : 23… ఈ నెంబర్‌ వింటేనే టీడీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. ఒకప్పుడు ఎన్డీయే కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ చంద్రబాబుకు 23 నెంబర్‌ అస్సలు కలిసిరావడం లేదు. 23 అనే నెంబర్‌ అంటేనే తెలుగు తమ్ముళ్లు వామ్మో బాబోయ్ అంటున్నారు. అందుకు అనేక కారణాలున్నాయి. వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఎప్పుడైతే టీడీపీ వైపు తిప్పుకున్నారో… అప్పటి నుంచి 23 నెంబర్‌ టీడీపికి సంక్షోభంగా మారింది. ఇదే అంశం గతంలో తీవ్ర చర్చనీయాంశంగా కాగా… తాజాగా మరోసారి నెంబర్‌ 23 హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును ఈనెల 23న విచారణకు ఆదేశించడమే అందుకు కారణం.

2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత… 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున అదే 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. విశేషమేంటంటే ఎన్నికల ఫలితాలను కూడా మే 23న ప్రకటించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అట్టర్‌ప్లాప్‌ అయింది. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత ఈ 23 సెంటిమెంట్‌ను సీఎం జగన్ గుర్తు చేశారు. దేవుడు గొప్ప స్క్రిప్ట్‌ రాశాడంటూ ఈ 23నే ఆయన బలంగా నొక్కి చెప్పారు. మండలి రద్దును కూడా సీఎం జగన్ జనవరి 23నే ప్రకటించారు. తాజాగా అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో అసలు నెంబర్‌ 23 అంటేనే తెలుగు తమ్ముళ్లూ భయపడుతున్నారు.

గతంలో టీడీపీకి ఆగస్టు సంక్షోభం ఉండేది. ఆగస్టు సంక్షోభం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గద్దె దించడంతో ప్రారంభమైంది. 1983 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌ను గద్దె దింపి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఎన్టీఆర్ మూడోసారి 1994 డిసెంబర్‌లో సీఎంగా ఎన్టీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆగస్టులో మరోసారి టీడీపీలో సంక్షోభం నెలకొంది.

అధికార పీఠం వ్యవహారంలో టీడీపీ.. ఎన్టీఆర్, చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా రెండుగా చీలిపోయింది ఆగస్టులోనే. శాసనమండలి రద్దు తర్వాత టీడీపీకి ఆగస్టు సంక్షోభం పోయి… నెంబర్‌ 23 సంక్షోభం వచ్చిందని వైసీపీ నేతలు గతంలోనే సెటైర్లు వేశారు. ఇప్పుడు 23న విచారణకు హాజరైతే ఏంటి..? హాజరు కాకపోతే ఏంటన్నదానిపై టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.