రోడ్లపై కేక్ కటింగ్స్‌కు నో పర్మిషన్- పోలీసుల వార్నింగ్.. న్యూఇయర్ వేడుకలకు ఆంక్షలు
న్యూఇయర్ వేడుకల దృష్ట్యా ఏపీ పోలీసులు రూల్స్ తీసుకొచ్చారు. పలు ఆంక్షలు విధించారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

AP Police Rules For New Year Celebrations
AP Police : ఆంధ్రప్రదేశ్ లో న్యూఇయర్ జోష్ మొదలైంది. ఎటు చూసినా నయా సాల్ సందడే కనిపిస్తోంది. స్టార్ హోటల్స్ లో ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీజేల మోత, డిస్కో లైట్లతో హోటల్స్ అన్నీ మెరుపుల కాంతులతో వెలిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం నగరాలకు చేరుకుంటున్నారు. టూరిస్ట్ సిటీ విశాఖలో దాదాపు అన్ని హోటళ్లు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి.
న్యూఇయర్ కదా.. సెలబ్రేషన్స్ పేరుతో ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదు అంటున్నారు పోలీసులు. వేడుకల పేరిట రోడ్లపై రచ్చ చేస్తాము, ఫుల్లుగా మందు కొట్టి రోడ్లపైకి వస్తాము అంటే.. తాట తీస్తామని పోలీసులు హెచ్చరించారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు పోలీసులు నడుం బిగించారు.
Also Read : దొరికితే.. 6నెలలు జైలు, రూ.10వేలు ఫైన్.. న్యూఇయర్ వేడుకలకు పోలీసుల కొత్త రూల్స్
న్యూఇయర్ వేడుకల దృష్ట్యా ఏపీ పోలీసులు రూల్స్ తీసుకొచ్చారు. పలు ఆంక్షలు విధించారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే వారంతా పోలీసు శాఖ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ ఆదేశించారు. నిర్వాహకులు వేడుకలు జరిగే ప్రదేశంలో లోపలికి వెళ్లే మార్గంతో పాటు బయటకు వచ్చే మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజే స్పీకర్ల శబ్దం 45 డెసిబుల్స్ మించకూడదని స్పష్టం చేశారు. బాణసంచా కాల్చడం, సామర్ధ్యానికి మించి పాసులు, టికెట్లు జారీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లను పబ్ లోకి అనుమతిస్తే కేసు నమోదు చేస్తామన్నారు.
Also Read : న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసుల సరికొత్త ప్రయోగం.. ఇలా దొరికిపోతారంతే..
ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం వరకే మద్యం విక్రయించాలని, అగ్నిమాపక శాఖ అధికారుల సలహాలు పాటించాలని సూచించారు. వీటన్నింటిని కస్టమర్లకు తెలిసేలా వేడుకలు జరిగే ప్రాంతంలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రాత్రి 10 గంటల నుంచి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు. రాత్రి 11 తర్వాత అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామన్నారు. రోడ్లపై కేక్ కటింగ్స్ కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.