గుడ్ న్యూస్ : తెలంగాణ, ఏపీలో నేడు నమోదు కాని కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం సాయంత్రం వరకు ఒక్క కేసు కూడా రికార్డు కాలేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ అములు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 39 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో 8 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణాలో : –
తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రతి రోజు ఒకటి, రెండూ కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ బుధవారం సాయంత్రం వరకు ఒక్క కేసు కూడా నమోదు కావడంతో సంతోషం వ్యక్తమౌతోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ (14 గంటలు)కు సపోర్టు ఇస్తూనే..24 గంటల పాటు బంద్ పాటించాలని చేయాలని..దీనికి సపోర్టు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. జనతా కర్ఫ్యూను తెలంగాణ ప్రజలు సక్సెస్ చేశారు.
తర్వాతి రోజు..మాత్రం ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇష్టమొచ్చినట్లు రోడ్ల మీదకు వచ్చారు. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి..సాయంత్రం హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇదే విధంగా వ్యవహరిస్తే..బాగుండదని, 24 గంటల పాటు కర్ఫ్యూ, లేనిపక్షంలో కనిపిస్తే కాల్చివేత, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుతామన్నారు.
ఇలాంటి పరిస్థితి రానివ్వొద్దని 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. మార్చి 25వ తేదీ బుధవారం ఉగాది పర్వదినం ఉండడంతో ఉదయం మార్కెట్ లు కిటకిటలాడాయి. ప్రజలు మాస్క్ లు లేకుండానే బయటకు వచ్చారు.
పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రజా ప్రతినిధులు సైతం రంగంలోకి దిగారు. వారి వారి నియోజకవర్గాలు, ఏరియాల్లో తిరిగి పరిస్థితిన సమీక్షించారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేసులు నమోదు కాకపోవడం..ఇదే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు.
ఏపీలో : –
ఇక ఏపీ విషయానికి వస్తే..అక్కడ కూడా ఒక్క కేసు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటి వరకు 312 మంది శాంపిళ్లను పరీక్షలకు పంపించామని, 8 మందికి కరోనా పాజిటివ్ గా వచ్చిందన్నారు. 62 మంది రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.
ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కరోనా అనుమానిత కేసులను ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలందించాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. విదేశాల నుంచి ఏపీకి 29 వేల మంది విదేశీయులు రాష్ట్రానికి రావడం జరిగిందన్నారు.
ప్రతింటికి ఫీవర్ సర్వే ఉంటుందని, ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ సెంటర్లు పెడుతున్నట్లు చెప్పారు.