గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన.. పోలీసుల కీలక ప్రకటన..

ఆందోళన చేసిన విద్యార్థినుల పట్ల వేధింపులు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన.. పోలీసుల కీలక ప్రకటన..

Gudlavalleru Engineering College Incident : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన వివాదం సద్దుమణిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బంది సమక్షంలోనే గర్ల్స్ హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు పోలీసులు. ఎలక్ట్రానిక్ డివైస్ ను గుర్తించే పరికరాలతో వాష్ రూమ్స్ తో పాటు హాస్టల్ లో అణువణువూ గాలించారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది సమక్షంలోనే దాదాపు 4 గంటలకు పైగా పోలీసుల తనిఖీలు సాగాయి. ఎక్కడా హిడెన్ కెమెరా లభించలేదని పోలీసులు తెలిపారు.

తమ సమక్షంలోనే జరిగిన తనిఖీల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థినులు ఆందోళనను విరమించారు. కాగా, సోమవారం వరకు కాలేజీకి సెలవులు ప్రకటించి మరోమారు తనిఖీలు చేపడతామని యాజమాన్యం ప్రకటించింది. అటు.. ఆందోళన చేసిన విద్యార్థినులపై ఎలాంటి చర్యలు, కక్ష సాధింపు ఉండరాదని కాలేజీ యాజమాన్యానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఆందోళన చేసిన విద్యార్థినుల పట్ల వేధింపులు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి హాస్టల్ లో ఉండేందుకు అంగీకరించారు విద్యార్థినులు.

Also Read : అమ్మాయిల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు..! కాలేజీ యాజమాన్యం ఏమందంటే..