Corona Vaccine : ఫోన్‌ మాట్లాడుతూ టీకా వేసిన నర్సు..

ఓ నర్స్‌ ఫోన్‌ మాట్లాడుతూ టీకా వేశారు. దీంతో అధికారులు ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Corona Vaccine : ఫోన్‌ మాట్లాడుతూ టీకా వేసిన నర్సు..

Nurse Vaccinated Talking On The Phone

Updated On : April 10, 2021 / 8:57 PM IST

nurse Vaccinated talking on the phone : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే అత్యంత జాగ్రత్తగా వ్యాక్సిన్ వేయాల్సివుంటుంది. కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా టీకా వేస్తున్నారు. మొదటిసారి ఒకటే డోస్ ఇవ్వాలి కానీ.. రెండో డోసు కూడా ఇచ్చిన సంఘటన ఇటీవలే జరిగింది. పలుచోట్ల వైద్యులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అయితే తాజాగా ఓ నర్స్‌ ఫోన్‌ మాట్లాడుతూ టీకా వేశారు. దీంతో అధికారులు ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురంలో చోటుచేసుకుంది.

ఫోన్ మాట్లాడుకుంటూ టీకా వేస్తున్న నర్సు హేమలత ఫొటో ప్రచారంలోకి రావడంతో వ్యాక్సిన్‌ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో నర్సుకు జిల్లా వైద్యశాఖ అధికారిణి రమణ కుమారి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ముగ్గురు వృద్ధ మహిళలకు కరోనా వ్యాక్సిన్‌కు బదులుగా రేబిస్ వ్యాక్సిన్ అందించారు. షమ్లీ జిల్లాలోని కందార పీహెచ్సీకి సరోజ్, అనార్కలి, సత్యవతి అనే ముగ్గురు వృద్ద మహిళలు కరోనా టీకా వేయించుకోవడానికి వచ్చారు. అలా వచ్చిన వారికి పీహెచ్.సి సిబ్బంది టీకా అందించారు. టీకా వేసిన తరువాత జరిగిన పొరపాటును గ్రహించి షాక్ అయ్యారు.

అయితే, టీకా తీసుకున్న ముగ్గురు మహిళల్లో కొన్ని దుష్ప్రభావాలు కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన మహిళలు అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించి, రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.