Pamarru Constituency: ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి?
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిమ్మకూరులోనే ప్రారంభించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు స్కెచ్ రెడీ చేస్తున్నారని చెబుతున్నారు.
Pamarru Assembly Constituency: టీడీపీ వ్యవస్థాపకులు, అన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రు.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పామర్రులో ఓటర్లు వరుసగా వైసీపీకే జైకొడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ (YSR Congress Party) అభ్యర్థులను గెలిపించిన ఓటర్లు ప్రతిపక్ష టీడీపీకి అంతుచిక్కని తీర్పు నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని (Telugu Desam Party) స్థాపించి.. రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన అన్న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు (Nimmakuru) ఉన్న పామర్రులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి వచ్చింది? 2009లో కాంగ్రెస్.. 2014, 19ల్లో వైసీపీని ఆదరించిన ఓటర్లను టీడీపీ మెప్పించలేకపోతోందా? వచ్చే ఎన్నికల్లో పామర్రు తీర్పు ఎలా ఉండబోతోంది?
పామర్రు నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. 1972లో రద్దైంది.. మళ్లీ 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పాటైంది. ఎస్పీ రిజర్వుడైన పామర్రులో తొలి నుంచి కాంగ్రెస్, వైసీపీ హవాయే నడుస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్వస్థలం నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలోనే ఉంది. కానీ, గత మూడు ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేకపోయింది టీడీపీ. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఫైర్‌బ్రాండ్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) కుమారుడు వర్ల కుమార్‌రాజా (Varla Kumar Raja) టిక్కెట్ ఆశిస్తున్నారు.
గత రెండు ఎన్నికల్లో ఒకసారి వర్ల రామయ్య, మరోసారి కుమార్‌రాజా పోటీ చేసినా.. విజయం వైసీపీనే వరించింది. 2014లో వైసీపీ తరపున ఉప్పులేటి కల్పన (Kalpana Uppuleti) గెలిచారు. 2019లో గెలిచిన కైలే అనిల్‌కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. 2014లో వర్ల రామయ్యపై గెలిచిన కల్పన.. తర్వాత టీడీపీలో చేరగా.. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ 32 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నాయకుడిగా నిలిచారు. ఇక 2024 ఎన్నికల్లో వరుసగా, మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కోటి ఆశలతో ఉంది వైసీపీ. ఐతే ఒక్కసారైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో పనిచేస్తోంది టీడీపీ.
సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమారే మళ్లీ పోటీ చేసే చాన్స్ కనిపిస్తోంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో నేత లేకపోవడం అనిల్‌కుమార్‌కు కలిసొస్తుంది. నియోజకవర్గంలో అధికంగా ఉన్న ఎస్సీ ఓట్లు అనిల్‌కుమార్‌కు అడ్వాంటేజ్‌గా చెబుతున్నారు. వైసీపీ SC సెల్ అధ్యక్షుడిగా అనిల్‌కుమార్ పనిచేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహణలోనూ ఎమ్మెల్యేకు మంచి మార్కులే ఉన్నాయి. ఐతే అవినీతి ఆరోపణలు, ఇసుక, మట్టి తవ్వకాలు, ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు ఎమ్మెల్యేకు మైనస్‌గా చెబుతున్నారు. కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణాలు తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని ఆశ పెట్టుకున్నారు ఎమ్మెల్యే.. వైసీపీ హయాంలోనే అభివృద్ధి చేశామని.. గత ప్రభుత్వంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్నారు. తనకు టీడీపీ అసలు పోటీయే కాదంటున్నారు ఎమ్మెల్యే.
గెలుపుపై ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ధీమాగా ఉండగా.. ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ సారి విజయం సాధిస్తామని గంపెడు ఆశలు పెట్టుకుంటోంది. సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్‌రాజా పామర్రు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో కొన్నాళ్లు వర్గ విభేదాలతో కుమార్‌రాజా హైరానా పడ్డారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కల్పన నియోజవర్గానికి దూరంగా ఉండటంతో కుమార్‌రాజా ఒక్కరే మొత్తం వ్యవహారాలను చక్కబెడుతున్నారు. 2014లో స్వల్ప ఓట్లతోనే ఓడిపోయామని.. 2019లో వైసీపీ హవాలో విజయాన్ని అందుకోలేకపోయమని.. ఈ సారి ఎలాంటి పొరపాటు జరగకుండా.. గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెబుతున్నారు కుమార్ రాజా. అధికార పార్టీ విధానాలపై పోరాటం చేయటంలో కుమార్రాజా వెనకబడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యవహరించిన తీరుతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కోలుకోలేకపోతుందనే టాక్ కూడా ఉంది.
Also Read: నగరిలో ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారో!?
వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన డీవై దాస్‌ను టీడీపీలోకి తేవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఐతే ఆయన టిక్కెట్ ఇవ్వాలని కండీషన్ పెడుతుండటంతో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడుతోంది. మరోవైపు ఈ నియోజకవర్గంపై పక్కనే ఉన్న గుడివాడ నేతల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము (Ramu Venigandla) పామర్రు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిమ్మకూరులోనే ప్రారంభించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు స్కెచ్ రెడీ చేస్తున్నారని చెబుతున్నారు. ఐతే జిల్లాలోని మూడు రిజర్వుడు సీట్లను ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గానికే కేటాయించడంపై విమర్శలు వినిపిస్తున్నా.. పార్టీలో వర్ల రామయ్య ప్రభావం వల్ల కుమార్‌రాజా సీటుకు డోకా ఉండదని భావిస్తున్నారు.
పామర్రు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. పామర్రు, పెదపారుపూడి, మువ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మొత్తం 106 గ్రాములు ఉండగా, ప్రధానంగా తాగునీటి సమస్య వేధిస్తోంది. అదేవిధంగా పాముల లంక వంతెన చిరకాల కలగా మారింది. వచ్చే ఎన్నికల్లో తాగునీటి సమస్య ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి జనసేన నుంచి ఎవరూ పోటీ చేసే అవకాశం కనిపించకపోవడంతో టీడీపీ, వైసీపీ మధ్యే హోరాహోరీ పోటీ జరిగేలా ఉంది. వరుసగా రెండు సార్లు గెలిచిన వైసీసీ హ్యాట్రిక్ కోసం గట్టిగా పనిచేస్తుండగా.. గెలుపు ఆకలి తీర్చుకోవాలని టీడీపీ తహతహలాడుతోంది.