పార్లమెంట్ సమావేశాలు : వైసీపీ వర్సెస్ టీడీపీ

అమరావతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోటు శానసమండలి రద్దు తీర్మానం వంటి అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జరిపిన అఖిపక్ష సమావేశానికి హాజరైన గల్లా జయదేవ్.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.
అమరావతిలో పోలీసుల దమనకాండ, 144 సెక్షన్ అమలు వంటి అంశాలను లేవనెత్తాలని నిర్ణయించారు. అలాగే మండలి రద్దు తీర్మానంపై కూడా తమ పార్టీ వైఖరిని ప్రకటించారు. రైతుల ఆందోళనను జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు మరో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. 3 రాజధానులు, శాసన మండలి రద్దు తీర్మానం వంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు
మరోవైపు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. అఖిలపక్ష సమావేశానికి హాజరైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. రాజధాని నిధుల అంశంతోపాటు రామాయపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం వంటి అంశాలను ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తెచ్చారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రం 3 రాజధానులకు ఉపయోగించుకోవచ్చన్నారు విజయసాయిరెడ్డి. అలాగే మండలి రద్దు తీర్మానాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
మొత్తానికి ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపనున్నాయి. మరోవైపు పార్లమెంట్‌లో 22 మంది బలం ఉన్న వైసీపీ తమ తీర్మానాన్ని ఎలాగైనా అమోదించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.
Read More : యూపీలో క్రిమినల్ ఖతం : 23 మంది పిల్లలు సేఫ్