జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదు. భ్రమల్లోంచి ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?

జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

pawan kalyan criticise ys jagan not changed his attitude after lost election

Pawan Kalyan on YS Jagan attitude: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అధికారం పోయినా జగన్ అహంకార ధోరణి మారలేదని విమర్శించారు.

”జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే విమర్శలు చేస్తున్నారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తు కుట్రలకు తెరలేపుతున్నారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలు రెచ్చకొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనం. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానన్న భ్రమల్లోంచి ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో? రాష్ట్రాభివృద్ధికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సీఎం చంద్రబాబుకు.. నేను నా పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తామ”ని పవన్ కల్యాణ్ చెప్పారు.

జగన్‌కు భంగపాటు తప్పదు: సత్యకుమార్
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ కూడా.. జగన్ ధోరణిపై మండిపడ్డారు. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా ఆయనను పట్టించుకునేవారు లేరని, ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర సహకారంతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని సూచించారు. రాష్ట్రానికి ఉన్న నిధుల కొరతను అధిగమించేందుకు కలసి కట్టుగా ప్రయత్నిద్దామని అన్నారు.

Also Read: భయం.. భయం.. భయం.. అంటూ వైఎస్ జగన్ సంచలన కామెంట్స్

కూటమి పార్టీల మధ్య సమన్వయంపై కీలక చర్చ
మిత్రపక్షాల మధ్య విబేధాలను జగన్ కోరుకుంటున్నారని.. ఆ అవకాశం ఇవ్వొద్దని కూటమి శాసనసభా పక్షం అభిప్రాయపడింది. కూటమి పార్టీల మధ్య సమన్వయంపైనా కీలక చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయితో పాటు క్షేత్ర స్థాయిలోనూ మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో వెళ్లాలని, దీని కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్సూచించారు. దీనికి సీఎం చంద్రబాబు అంగీకరించారు. పార్టీల మధ్య సమన్వయ కమిటీల అవసరం ఉందని ఆయన అన్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాని, నామినేటెడ్ పోస్టులకు ప్రతిపాదనలు పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సొంత పార్టీ కార్యకర్తల పేర్లతో పాటు.. గెలుపునకు సహకరించిన మిత్రపక్ష నేతల పేర్లనూ సిఫార్సు చేయాలన్నారు.