Pileru : వాలంటీరే హంతకుడు, వివాహేతర సంబంధమే కారణం.. పీలేరులో ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ
ఆటో ఎక్కి వెనుక నుంచి అతని మెడపై విషపు ఇంజక్షన్లు ఇచ్చింది సుపారీ గ్యాంగ్. ఆసుపత్రికి వెళ్లేలోగా సుధాకర్ చనిపోయాడు. Pileru Auto Driver Case

Pileru Auto Driver Case(Photo : Google)
Pileru Auto Driver Case : అన్నమయ్య జిల్లా పీలేరులో సంచలనం రేపిన ఆటోడ్రైవర్ సుధాకర్ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీని చేధించారు పోలీసులు. ఆటో డ్రైవర్ ది హత్యగా నిర్ధారించారు పోలీసులు. అంతేకాదు వాలంటీర్ కిషోర్.. సుపారి గ్యాంగ్ తో కలిసి సుధాకర్ ను హత్య చేసినట్లు చెప్పారు. సైనైడ్ ఇంజక్షన్ ఇచ్చి మరీ సుధాకర్ ను చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం నేపథ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
బతుకుదెరువు కోసం కువైట్ కు వెళ్లిన సుధాకర్ ఇటీవలే పీలేరుకు వచ్చేశాడు. జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటున్నాడు. కాగా, తన భార్య అశ్విని స్థానిక వాలంటీర్ కిషోర్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సుధాకర్ తెలుసుకున్నాడు. ఈ విషయమై వాలంటీర్ కిషోర్ ను కొన్ని రోజుల క్రితం తీవ్రంగా హెచ్చరించాడు సుధాకర్. తన భార్యకు దూరంగా ఉండాలని, తీరు మార్చుకోవాలని వాలంటీర్ తో చెప్పాడు. దాంతో వాలంటీర్ కోపంతో రగిలిపోయాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న సుధాకర్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం దారుణానికి ఒడిగట్టాడు.
తిరుపతిలో తనకు తెలిసిన ఐదుగురు యువకులకు సుపారీ ఇచ్చి మరీ హత్యకు ప్లాన్ చేశాడు వాలంటీర్ కిషోర్. ఇందులో భాగంగా ఆగస్టు 31వ తేదీన సుధాకర్ ఆటో ఎక్కి వెనుక నుంచి అతని మెడపై విషపు ఇంజక్షన్లు ఇచ్చింది సుపారీ గ్యాంగ్. ఆసుపత్రికి వెళ్లేలోగా సుధాకర్ చనిపోయాడు. ఆటోడ్రైవర్ భార్య అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పీలేరు పోలీసులు.
ఆ తర్వాత వారికి ఎందుకో అనుమానం వచ్చింది. అంతే తమదైన స్టైల్ లో విచారణ జరిపారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆటోడ్రైవర్ సుధాకర్ ది హత్యగా తేల్చారు పోలీసులు. హంతకుడు వాలంటీర్ కిషోర్ అని, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అని వెల్లడించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కాగా, కిషోర్ తన వాలంటీర్ ఉద్యోగానికి గత నెలాఖరున రాజీనామా చేశాడని పోలీసులు చెప్పారు.
Also Read..Auto Journey : ఆటోల్లో ప్రయాణిస్తున్నారా.. బీకేర్ ఫుల్.. ఎందుకంటే