ఎలక్షన్ ‘టూర్’: ప్రయాణ ఖర్చులకు రెక్కలు

ఒకవైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు ఎలక్షన్.. ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే నాలుగు రోజులు హ్యాపీగా ఊళ్లలో గడపడమే కాకుండా, దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అత్యంత పవిత్రమైన ఓటు హక్కును వాడుకోవచ్చు. ఇది నగరాలకు వలస వచ్చి బ్రతుకుతున్న సాటి ఉద్యోగి మనోగతం.
అయితే ఎంతో బాధ్యతగా పోలింగ్‌కు ఊరెళ్లి వద్దామనుకునే వాళ్లకు మాత్రం బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుండడంతో ఎలా వెళ్లాలో తోచని పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అయితే ధరలను ఏకంగా ఐదారు రెట్లు ఎక్కువ చేసేశాయి. ఒక్కో టిక్కెట్ ధరను రూ.2500 నుంచి రూ.3000 చేసేశాయి. కుటుంబంతో కలసి ఊరెళ్లడానికి ప్రయత్నిస్తే ఒక నెల జీతం చార్జీలకే పెట్టవలసిన పరిస్థితి ఉంది అని సగటు ఉద్యోగి మదనపడుతున్నాడు.
ఇప్పటికే రైళ్లు, బస్సులు కిటకిటలాడడడం మొదలవగా.. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు 10 లక్షల మందికి పైగా సిటీలోని వాళ్లు సొంత ఊళ్లకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బయలుదేరే ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో సగానికిపైగా రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి.
విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. కొన్ని రైళ్లలో 150 నుంచి 200కు పైగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ట్రావెల్ ఏజన్సీల అదనపు వసూళ్లను అరికట్టడం, ఎన్నికల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైళ్లను అదనంగా ఏర్పాటు చేయడం ముఖ్యం అని ప్రజలు అంటున్నారు. ఈమేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం కూడా ఉంది.