Kurnool Ex Gratia : కర్నూలు రోడ్డు యాక్సిడెంట్ పై స్పందించిన ప్రధాని మోదీ.. బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటన
Kurnool Road Accident Ex Gratia : కర్నూలు రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాన మంత్రి నరేందో మోదీ స్పందించారు
PM Narendra Modi Announces Rs 2 Lakh Ex Gratia for Kurnool Road Accident Victims
- కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై మోదీ స్పందన
- బాధితులకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
- గాయపడిన వారికి రూ.50 వేలు
Kurnool: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కర్నూలు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అలానే ఈ యాక్సిడెంట్ లో గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ రెండూ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 12 మందికి గాయాలయ్యాయి. బాధితులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిని అమృత, తేజస్వని, ధన్య, దీపక్, దీక్షిత, ప్రతాప్ కుమారగా గుర్తించారు. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు ప్రాంతానికి చెందినవారని తెలిసింది. బాధితులు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
