జగన్ తిరుపతి టూర్ ఎఫెక్ట్.. జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ 30 విధింపు
వివిధ పార్టీల నాయకులు, సంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు.

Ys Jagan
Ys Jagan Tirupati Tour : జగన్ తిరుపతి పర్యటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ 30 విధించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వివిధ పార్టీల నాయకులు, సంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు.
తిరుపతి జిల్లా అంతటా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తూ స్వయంగా జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు తిరుపతి రాబోతున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి నేతలంతా హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ, జనసేన నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. హిందూ మతంపై తనకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని చెబుతూ ప్రధానంగా డిక్లరేషన్ పై సంతకం చేశాకే కొండపైకి వెళ్లనిస్తామని, లేదంటే అలిపిరి వద్దే అడ్డుకుంటామని పెద్ద ఎత్తున ఇటు బీజేపీ, అటు జనసేన నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. రేపు సాయంత్రం జగన్ తిరుపతి రాబోతున్నారు.
దీంతో ఆందోళనలు, నిరసనలు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా అంతటా పోలీస్ 30 యాక్ట్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ. సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నా.. నిరసనలు తెలపాలన్నా తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని ఎస్పీ తేల్చి చెప్పారు. ప్రధానంగా రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఒకరకంగా తిరుపతిలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.