టీడీపీకి ఊహించని ట్విస్ట్, ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

  • Published By: naveen ,Published On : October 28, 2020 / 01:13 PM IST
టీడీపీకి ఊహించని ట్విస్ట్, ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

Updated On : October 28, 2020 / 1:26 PM IST

pothula sunitha resign : టీడీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగునా కోర్టులను అడ్డుపెట్టుకుని టీడీపీ, చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ వైఖరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందన్నారు.

టీడీపీ వైఖరి, విధానాలకు నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సునీత, సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు‌. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా జగన్ కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు సునీత తెలిపారు. తన ఈ రాజీనామా లేఖను ఆమోదించాలని మండలి చైర్మన్ కోరారు సునీత.

పోతుల సునీత గతంలో టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దీంతో అక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైఎస్సార్‌సీపీలో చేరగా.. ఆమె మాత్రం టీడీపీలో కొనసాగారు. కానీ కొద్దిరోజుల తర్వాత అనూహ్యంగా వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చారు. వైసీపీలో చేరిన సునీతపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్‌ కు టీడీపీ ఫిర్యాదు చేయగా.. విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీత తన పదవికి రాజీనామా చేసి ట్విస్ట్ ఇచ్చారు.

2020 జనవరి 22న పోతుల సునీత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్ విషయంలో టీడీపీకి ఆమె షాకిచ్చారు. టీడీపీ విప్ కు వ్యతిరేకంగా పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు ఓటు వేశారు. వీరిద్దరూ ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు.