విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌.. తొమ్మిది గంటలు పక్కా!

  • Published By: sreehari ,Published On : November 4, 2020 / 07:08 AM IST
విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌.. తొమ్మిది గంటలు పక్కా!

Updated On : November 4, 2020 / 10:35 AM IST

Power Substations automation : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌ ప్రక్రియ షురూ అయింది. రూ.వెయ్యికోట్ల కాంట్రాక్టు పనులకు టెండర్‌ నిబంధనలు రూపొందించిన అధికారులు న్యాయసమీక్ష కోసం పంపించారు. గ్రీన్‌సిగ్నల్‌ రావడమే ఆలస్యం.. సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌ పూర్తయినట్టే.. అదేగాని జరిగితే.. 9 గంటల పగటి విద్యుత్‌ పక్కాగా వచ్చితీరుతుందని అంటున్నారు.



ఆటోమేటిక్‌గా వ్యవసాయ విద్యుత్‌ సరఫరా కానుంది. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో వ్యవసాయ ఫీడర్లను విద్యుత్‌ సిబ్బంది మాత్రమే ఆన్, ఆఫ్‌ చేస్తున్నారు.. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుందా లేదో స్పష్టత లేకుండా పోయింది. అందుకే సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌కు ఏపీ విద్యుత్‌శాఖ కొత్త మార్పులు చేసింది. కొన్ని సబ్‌స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఆటోమేషన్‌ చేపట్టారు.



మంచి ఫలితాలు రావడంతో అన్ని చోట్ల ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ సరఫరాను పరిశీలించవచ్చు. వ్యవసాయ విద్యుత్‌ లోడ్‌ను శాస్త్రీయంగా తెలుసుకుంటూనే రిమోట్‌ ద్వారా విజయవాడ నుంచి ఆపరేట్‌ చేయొచ్చు.
https://10tv.in/cm-kcr-on-power-act/
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌స్టేషన్లను ఆటోమేషన్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏపీలో ప్రస్తుతం 6,616 విద్యుత్‌ ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ పంపుసెట్లకు ఏటా 12,232 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 1,068 సబ్‌స్టేషన్లలో పూర్తి ఆటోమేషన్‌ చేయనున్నారు. తరువాత దశలో ఆటోమేషన్‌ చేస్తారు. ఆటోమేషన్‌ ప్రక్రియకు వెయ్యికోట్ల ఖర్చు కానుంది.



ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ఓకే చెప్పేసింది. ఇంటలెక్చువల్‌ ఎల్రక్టానిక్‌ డివైజ్‌ ద్వారా పనిచేసే ఈ సాంకేతికత రైతులకు ప్రయోజనకరంగా మారనుంది. ఫీడర్లు అవాంతట అవే ఆన్‌ అయిపోతాయి.

9 గంటల సమయం పూర్తవ్వగానే విద్యుత్‌ సరఫరా దానంతటే ఆగిపోతుంది. విద్యుత్‌ లోడ్‌ను సాంకేతికంగా తెలుసుకోవచ్చు. సబ్‌స్టేషన్‌ పరిధిలో కావాల్సిన మౌలిక సదుపాయాలతో విద్యుత్‌ సరఫరా నాణ్యత మరింత పెరగనుంది.