Pullalacheruvu : గ్రామాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు..ఎక్కడో తెలుసా ?
గ్రామాన్నే తాకట్టు పెట్టాలని స్కెచ్ వేశారు. పుల్లల చెరువు రెవెన్యూ కార్యాలయంలో తమ పలుకుబడిని ఉపయోగించారు. 2020లో 8.32 ఎకరాల భూమిని తమ పేరుపైకి...

Loan
Pullalacheruvu Village Bank Loan Scam : మనకు లోన్ కావాలంటే ఏం చేస్తాం.. ఇదేం డౌట్ అని రివర్స్ క్వశ్చన్ వేయకండి. రుణం కావాలంటే బంగారమో, నగలో.. లేకుంటే ఏవైనా ఆస్తిపత్రాలో ష్యూరిటీ కింద పెడతాం. కానీ ఏకంగా గ్రామాన్నే తాకట్టు పెట్టడాన్ని మీరెప్పుడైనా చూశారా. ప్రకాశం జిల్లాలో ఓ గ్రామాన్నే తాకట్టు పెట్టారు కొందరు ప్రబుద్దులు. లక్షల రూపాయల లోన్ తీసుకున్నారు. వచ్చిన డబ్బులతో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు చెరువు మండలం సిద్దనపాలెం గ్రామం 296 సర్వే నంబర్‌లో ఉంది. గ్రామ విస్తీరణం 8.32 ఎకరాల్లో ఉంటుంది. ఈ భూమిలోనే గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకుని శతాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు మాత్రం డబ్బుపై వ్యామోహం పెంచుకున్నారు. ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలనుకున్నారు.
Read More : AP PRC Fight : కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు..ఉత్తర్వులు, తగ్గేదే లే అంటున్న ఉద్యోగులు
చివరికి గ్రామాన్నే తాకట్టు పెట్టాలని స్కెచ్ వేశారు. పుల్లల చెరువు రెవెన్యూ కార్యాలయంలో తమ పలుకుబడిని ఉపయోగించారు. 2020లో 8.32 ఎకరాల భూమిని తమ పేరుపైకి మార్పించుకున్నారు గడ్డం సుబ్బయ్య, కొల్లి వీర బ్రహ్మయ్య. 296లోని భూమినంతా తమ పేరుపైకి మార్చి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా తీసుకున్నారు. గ్రామాన్ని తమ పేరుమీదకు మార్పించుకోవడంతోనే వీరు ఆగిపోలేదు. భూమిపట్టా పుస్తకాలు తాకట్టుపెట్టి లోన్ తీసుకోవాలని ప్లాన్ వేశారు. దీంతో యర్రగొండపాలెం ముత్తుకలోని డీసీసీబీ బ్యాంకును సంప్రదించారు. 2020 జూన్ 26న బ్యాంకును ఆశ్రయించి లోన్ కావాలని కోరారు. బ్యాంకు అధికారులు పాస్ పుస్తకాలను గమనించకుండానే ఆన్‌లైన్ రికార్డులు పరిశీలించి మూడు నెలల తర్వాత అంటే 2020 సెప్టెంబర్ 23న లోన్ మంజూరు చేశారు. మొత్తం 9 లక్షల రూపాయల రుణం మంజూరు చేయడంతో ఆ డబ్బును తమ జేబులో వేసుకున్నారు కేటుగాళ్లు.
Read More : Covid Cases : తెలుగు రాష్ట్రాలపై కరోనా పడగ.. తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో 100కుపైగా పాజిటివ్ కేసులు
వాస్తవానికి ఐదు ఎకరాల్లోపు ఉన్న అగ్రికల్చర్ భూములకు 2 లక్షల రూపాయలకు మించి అగ్రిలోన్ మంజూరు చేయరాదనే ఆర్‌బీఐ నిబంధనలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న కేటుగాళ్లు గ్రామ భూమిని ఏకంగా మార్టిగేజ్ చేయించి బ్యాంకులో లోన్‌కు అప్లై చేసుకున్నారు. తక్కువ విస్తీర్ణం కలిగిన భూమికి అధికమొత్తంలో లోన్ మంజూరు చేశారు బ్యాంకు అధికారులు. మొత్తం గ్రామాన్నే తాకట్టు పెట్టిన విషయం కొన్ని రోజులకు ఆనోటా ఈనోటా ప్రచారం జరిగి చివరికి గ్రామస్తులకు తెలిసింది. దీంతో బ్యాంకు, రెవెన్యూ అధికారులను నిలదీశారు. స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామాన్ని తాకట్టు పెట్టిన అంశంపై ప్రశ్నించగా అది తన హయాంలో జరగలేదన్నారు తహసీల్దార్ దాసు. గత తహసీల్దార్ అశోక్‌రెడ్డికే ఆ వ్యవహారం తెలుసని అంటున్నారు. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.