అర్థమవుతోందా: పల్స్ పోలియో నేడే(19 జనవరి 2020)

అర్థమవుతోందా: పల్స్ పోలియో నేడే(19 జనవరి 2020)

Updated On : January 19, 2020 / 12:50 AM IST

రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఆదివారం (19 జనవరి 2020) నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యం కోసం కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలియో సెంటర్లు అయిన స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను సిద్ధం చేసింది. 

ఆదివారం ఉదయం తన నివాసంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. రాష్ట్రంలో ఐదేళ్ల వయసులోపు చిన్నారులు 52.27 లక్షల మంది ఉన్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది.

ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల మందు బూత్‌లలో అందుబాటులో ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు సైతం పోలియో చుక్కలు అందేలా ఏర్పాట్లు చేశారు. అనుకోని కారణాలతో ఆదివారం ఎవరైనా చిన్నారులకు వేయించలేకపోతే జనవరి 20 నుంచి 22వ తేదీ వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 65.75 లక్షల డోస్‌ల పోలియో చుక్కల మందు రాష్ట్రానికి చేరింది.