Quantum Valley: ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు డీల్
టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం దేశంలోనే తొలి క్వాంటం సిస్టమ్ 2ను అమరావతిలో నెలకొల్పనుంది.

Quantum Valley: ఏపీ రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభం వేళ కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ను క్వాంటం కంప్యూటింగ్ రంగంలో దేశానికే మార్గదర్శిగా నిలపాలనే లక్ష్యంతో కీలక ఒప్పందం చేసుకుంది కూటమి ప్రభుత్వం. అమరావతిలో అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం దేశంలోనే తొలి క్వాంటం సిస్టమ్ 2ను అమరావతిలో నెలకొల్పనుంది.
156 క్యూబిట్ సామర్థ్యం కలిగిన అత్యాధునిక హెరాన్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలను 2026 జనవరి 1 నాటికి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో ఐటీ విప్లవానికి ఏపీ ఊతమిచ్చినట్లే ఇప్పుడు క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: అమరావతికి గ్యారంటీ.. మోదీ వరాలేంటి? ఇక రాజధాని పనులు ఎలా పరుగులు పెడతాయి?
ఇది ఏపీకే కాదు దేశానికే చరిత్రాత్మకమైన రోజు అని అన్నారు. భవిష్యత్తు పాలనకు, ఆవిష్కరణలకు క్వాంటం కంప్యూటింగ్ పునాది అవుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.