అమరావతికి గ్యారంటీ.. మోదీ వరాలేంటి? ఇక రాజధాని పనులు ఎలా పరుగులు పెడతాయి?
మొత్తానికి కేంద్రం సహకారంతో అమరావతి నిర్మాణ పనులు చకచకా సాగిపోనున్నాయి.

తెలంగాణకు హైదరాబాద్ రాజధాని.. అలాగే ఏపీకి అమరావతి రాజధాని… ప్రధాని మోదీ రాకతో ఏపీ రాజధాని ఏదనే ప్రశ్నలకు ఆన్సర్ దొరికినట్లేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అంశం ఇక క్లియర్ అయినట్లేనా? అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఇన్నాళ్లూ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి.. అమరావతి పునర్మిర్మాణ పనులతో ఇక లైన్ క్లియర్ అయినట్లే అన్న సమాధానం వస్తోంది. ఇంతకీ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకిచ్చిన గ్యారెంటీ ఏంటి? ఐదుకోట్ల ఆంధ్రులు కలలు కన్న రాజధాని కల సాకారం అయ్యేదెప్పుడు? వాచ్ దిస్ స్టోరీ.
ఏపీ రాజధాని అమరావతి ప్రాధాన్యత, ప్రత్యేకత, నిర్మాణంపై సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక వ్యాఖ్యలివి. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో ఏపీకి ఒక భరోసా, రాజధాని కల సాకారమైందన్న ఒక నమ్మకం కలిగినట్లు అయింది. రాజదాని అమరావతి నిర్మాణాన్ని మనం చెయ్యాలి…మనమే చెయ్యాలని మోదీ నొక్కిమరీ చెప్పారు. అంటే ఏపీలో ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పాడ్డాయి.
అటు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది. దీంతో రాజధాని నిర్మాణానికి పూచికపుల్లంతా అడ్డుకూడా రాదనేది మోదీ మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కావాల్సిందల్లా రాజధాని నిర్మాణం..అదీ కేంద్రం సహకారంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని మోదీ స్పష్టంగా చెప్పకనే చెప్పారన్నారు.
Also Read: అజ్ఞాతవాసిగా ఆ మాజీ ఎమ్మెల్యే.. కేసుల భయమేనా?
వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి అన్నట్లుగా…కేంద్రంలో మోదీ సర్కార్ ఉండడంతో ఇక రాజధాని అమరావతి నిర్మాణానికి ఎవరూ అడ్డుపడరని..ఏదీ అడ్డు రాదని…చక చకా రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మించుకోవాలని ఫుల్ పవర్స్ ఇచ్చేశారు ప్రధాని మోదీ. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడంతో అమరావతి నిర్మాణానికి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరపైకి తేవడంతో అప్పటివరకున్న అమరావతి తెరమరుగైంది.
5 కోట్ల ఆంధ్రుల్లో మళ్లీ ఆశలు
సీన్ కట్ చేస్తే ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో రాజధాని అమరావతిపై ఐదుకోట్ల ఆంధ్రుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. మరోసారి ప్రధాని మోదీ అమరావతి పునర్మిర్మాణ పనులను ప్రారంభించడంతో..ఐదు కోట్ల ఆంధ్రులు కన్న కలలు ఎట్టకేలకు సాకారం కాబోతున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇన్నాళ్లూ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇప్పుడొక రాజధాని అనేది ఖరారైంది. దీంతో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి తిరిగి పురుడు పోసుకుంది. అనేక సవాళ్లు, పోరాటాల మధ్య అమరావతి పునరుజ్జీవం పొందింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రాజధాని అమరావతి బాటలు వేయనుంది.
ప్రధాని మోదీ రాకతో అమరావతి 2.0 మొదలైంది. ఏపీ రాష్ట్రంలో నవశకం మొదలైందనే చెప్పాలి. అమరావతి నిర్మాణ పనులను ఏకకాలంలో చేపట్టేలా దాదాపు 77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. ఇదే క్రమంలో 49వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది. దీంతో రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వీలైనంత తొందరగా పని పూర్తి చేయాలని ఫిక్సయ్యింది.
ఇదే సమయంలో రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించేందుకు రైల్వే బోర్డు కూడా అంగీకారం తెలుపుతూ 2వేల 47కోట్లను మంజూరు చేసింది. ఎర్రుపాలెం-నంబూర్ మధ్య 56.53 కి.మీ. మేర రైల్వే లైన్ రానుంది. అదేవిధంగా 189.4 కి.మీ. పొడవున అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ను 16,310 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించిన ఖర్చును భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
మొత్తానికి కేంద్రం సహకారంతో అమరావతి నిర్మాణ పనులు చకచకా సాగిపోనున్నాయి. దీంతో ఏపీ రాజధాని అమరావతి కల అతి త్వరలోనే సాకారం కాబోతుంది. మరో మూడు, మూడున్నరేళ్లలో అమరావతి ఓ అందమైన రూపాన్ని సంతరించుకోనుంది. దీని కోసం ఐదు కోట్ల ఆంధ్రులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.