సంక్రాంతి సందడి : ముగ్గులతో కలర్‌ఫుల్‌గా లోగిళ్లు, యువతుల కోలాటం

సంక్రాంతి అంటేనే.. ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. రంగవల్లులు.. భోగిమంటలు.. పిండివంటలు.. కోడిపందాలు..ఇక కోనసీమలో జరిగే సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 06:38 AM IST
సంక్రాంతి సందడి : ముగ్గులతో కలర్‌ఫుల్‌గా లోగిళ్లు, యువతుల కోలాటం

Updated On : January 14, 2020 / 6:38 AM IST

సంక్రాంతి అంటేనే.. ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. రంగవల్లులు.. భోగిమంటలు.. పిండివంటలు.. కోడిపందాలు..ఇక కోనసీమలో జరిగే సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

సంక్రాంతి అంటేనే.. ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. రంగవల్లులు.. భోగిమంటలు.. పిండివంటలు.. కోడిపందాలు.. ఒక్కటేమిటి.. చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ప్రతీ ఇల్లూ సంక్రాంతి శోభతో కళకళలాడుతూనే ఉంటుంది. ఇక కోనసీమలో జరిగే సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 

కోనసీమ జిల్లాల్లో పల్లెల అందాలు సంక్రాంతి సంబరాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా..ఇక్కడి పల్లె సీమలు మాత్రం ఇప్పటికి మట్టివాసనలా మనస్సుకు హత్తుకునేలా .. ప్రకృతి రమణీయతను కొనసాగిస్తున్నాయి. అందుకే సంక్రాంతి సంబరాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బెంగుళూరు, కర్ణాటక, తమిళనాడు నుంచి కోనసీమకు భారీగా జనం తరలివస్తుంటారు. 

muggulu

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే పేర్లతో పిలుచుకొనే ఈ నాలుగు రోజుల సంక్రాంతి పండుగ పల్లె ముంగిట్లో పట్నం పరిమళాలు వెదజల్లుతుంది. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి పండుగ.. ఈ భోగి మంటల భగభగలు అందరిలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. భోగి మంటల్లో పాత కలప, ఇంటిలోని పాత సామానులు వేస్తారు. ఇలా ఇంటికి కొత్త అందాలను సమకూర్చాలని కోరుకుంటారు. భోగిమంటపై కుండతో నీళ్ళు కాచుకుని ఇంటిల్లిపాది తలస్నానాలు చేస్తారు. 

సాయంత్రం పసిపిల్లల తలపై భోగిపళ్లు పోసి దీవిస్తుంటారు. పేరంటం జరిపి చిన్న చిన్న బొమ్మలు, కుంకుమ భరిణలను కానుకలుగా ఇస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ మూడు రోజులు బొమ్మల కొలువు కూడా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

సంక్రాంతి రోజు సూర్యుడు ధనుర్‌ రాశిలోంచి మకర రాశి లోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగకు మకర సంక్రాంతి అని కూడా పేరు. కుటుంబంలోని వారు..  వారి పితృదేవతలను తలచుకుని పూజించడం, వారికి వస్త్రాలు పెట్టడం, పొంగలి నైవేద్యం సమర్పిస్తుంటారు. కనుక ఈ పండుగను పెద్దల పండుగ అంటారు. 

color muggu

ఈ పండుగ ప్రత్యేకత పిండివంటలు. బెల్లం, నువ్వులలతో చేసిన అరిసెలు, బూరెలు, చక్కిలాలు, లడ్డూలు, మురుకులు వంటి పిండివంటలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ప్రత్యేకించి బొబ్బట్లు.. పూతరేకులు… ఇలా నోరూరించే వంటకాలు అతిథులకు స్వాగతం పలుకుతుంటాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లన్నీ కలర్‌ఫుల్‌గా మారాయి. పూలతో అలంకరించిన గొబ్బెమ్మల చుట్టూ కోలాటం ఆడుతూ యువతులు… పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.