పులివెందులలో టీడీపీ లాస్ట్‌ వికెట్‌!

  • Published By: sreehari ,Published On : February 18, 2020 / 05:10 PM IST
పులివెందులలో టీడీపీ లాస్ట్‌ వికెట్‌!

Updated On : February 18, 2020 / 5:10 PM IST

పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కానుందనే చర్చ ఏ ఇద్దరు కలిసినా హాట్‌హాట్‌గా జరుగుతోంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గలో ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కీలక నేతగా ఉన్న  సతీష్‌రెడ్డి కూడా ఇప్పుడు గుడ్‌బై చెబుతున్నారనే ప్రచారం జోరందుకుంది. కొద్ది రోజులుగా పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన.. ఇక తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేస్తారంటున్నారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. 

సతీష్ రెడ్డి టీడీపీని వీడితే :
పార్టీ అధినేత చంద్రబాబుతో సతీష్‌కుమార్‌ రెడ్డికి సఖ్యత ఉన్నా.. లోకేశ్‌ వ్యవహార శైలితో విసిగిపోయారనే టాక్‌ వినిపిస్తోంది. సతీష్‌రెడ్డి టీడీపీని వీడితే పులివెందులలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని పార్టీ కార్యకర్తలే అంటున్నారు. గత కొన్నేళ్లుగా వైఎస్ కుటుంబంపై టీడీపీ అభ్యర్థిగా పోటీకి నిలుస్తూ వచ్చారు సతీష్‌రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, అనేక సార్లు ఓటమి చెందడంతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సతీష్‌రెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిచ్చారు. 

కాంట్రాక్టు పనుల కోసమేనా? :
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సతీష్‌రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవులిచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగియడంతో అదే నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవికి అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. 2019లో జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల నుంచి సతీష్‌రెడ్డి పోటీ చేశారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు తగిన న్యాయం చేయలేకపోయిందన్న కారణంగానే ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిందంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సతీష్‌రెడ్డి చేపట్టిన కాంట్రాక్టు పనుల బిల్లుల కోసమే వైసీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.