వదిలిపెట్టం విచారణ చేపడతాం.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

గంజాయి, డ్రగ్స్ వినియోగంపై దృష్టి పెడతామని, డీ ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

వదిలిపెట్టం విచారణ చేపడతాం.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

Minister Satya Kumar

Minister Satya Kumar : ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లోని తన చాంబర్ లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు అరాచక పాలనకు అంతం పలికి నిజమైన సంక్షేమపాలనకు ప్రజలు పట్టంకట్టారని అన్నారు. సామాన్య కార్యకర్తనైన నన్ను గుర్తించి ఈ స్థాయికి చేర్చినందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ఎన్డీయే కూటమి పనిచేస్తుందని, రాజకీయ వివక్ష లేకుండా సేవలు అందిస్తామని తెలిపారు.

Also Read: మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ.. అమరావతి నిర్మాణంపై కీలక వ్యాక్యలు..

ఎన్డీయే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిందని చెప్పారు. సంక్షేమం, మెరుగైన వైద్యం, మెడికల్ ఎక్యూప్మెంట్ అందజేయడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. 18 సంవత్సరాలలోపు వారి ఆరోగ్యంకోసం రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం ఫైలుపై మొదటి సంతకం చేశానని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్ల జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేసేందుకు రెండవ సంతకం చేయడం జరిగిందని అన్నారు. ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్పారు.

Also Read : చంద్రబాబు శ్వేతాస్త్రం.. గత వైసీపీ ప్రభుత్వ అప్పుల లెక్కలపై..

గంజాయి, డ్రగ్స్ వినియోగంపై దృష్టి పెడతామని, డీ ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రచారం ఎక్కువ.. పని తక్కువగా జరిగింది. అసలు పనిజరగలేదని నేను చెప్పడం లేదు. వైద్య రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. కేంద్ర నిధులు మళ్లింపుపై కేంద్రం పెనాలిటీ వేసింది.. ఆరోగ్య శ్రీలో అవకతవకలు ఉన్నాయి. దళారుల మయం అయింది. ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించలేదు. వాటిపై విచారణ చేపడతాం. కొత్త కాలేజీలు ఏర్పాటులో నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ పాటించలేదు. అన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రాంతాలను ఎంపికను పరిశీలిస్తామని సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దార్శినికులైన ఇద్దరి నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. జవాబుదారి తనంతో అందరూ మెలగాలని అన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికోసం చేసిన నాడూ నేడు కార్యక్రమానికి నిధుల మళ్లింపు జరిగింది. వాటిపై దర్యాప్తు చేస్తామని సత్యకుమార్ యాదవ్ అన్నారు.