టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి శిద్ధా రాఘవరావు!

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమౌతోంది.
2020, మార్చి 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెం సీఎం నివాసంలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఆయన వైసీపీలో చేరరని తొలుత ప్రచారం జరిగింది. కానీ పక్కాగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే సమాచారం బయటకు పొక్కడంతో జిల్లాలో కలకలం రేపాయి. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఆల్ రెడీ ఖాళీ అయిపోయిందని చెప్పవచ్చంటున్నారు. ప్రస్తుతం శిద్ధాతో పాటు ఆయన సోదరులు, తనయుడు వైసీపీ చేరబోతున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతగా ఉన్న గాదె వెంకట్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది.
See Also | సీఎం జగన్ తీవ్ర ఆరోపణల తర్వాత గవర్నర్‌ను కలిసిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్
శిద్ధా రాఘవరావు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. పార్టీని వీడుతారనే సమాచారం రావడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు ఎంపీ స్థానం నుంచి శిద్ధా..కనిగిరి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన ఆయన తనయుడు సుధీర్ కుమార్‌లు పరాజయం పాలయ్యారు. ఓటమి అనంతరం పార్టీ తమకు అండగా లేదని శిద్దా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా..టీడీపీలో కొనసాగితే..రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయన భావించి..పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మరింత ఎక్కువగా వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కీలక నేతల్లో కొందరు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. గత వారం రోజుల్లో కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నహితుడిగా ఉన్న కదిరి బాబురావు వైసీపీలో చేరిపోయారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్, మాజీ మంత్రి పాలేటి రామరావులు కూడా పార్టీ కండువాలు కప్పుకున్నారు. రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి, కదిరె బాబురావుతో పాటు విశాఖ జిల్లాకు చెందిన నేతలు వైసీపీలో చేరుతున్నారు. మరి కీలక నేతలు చేజారిపోకుండా టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూడాలి.
Read More : CAAపై తీర్మానం : ఇలా మాట్లాడితే దేశద్రేహి ? అసహన వైఖరి సరికాదు – కేసీఆర్