మచిలీపట్నం ఎంపీ వైసీపీ అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్
సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి.. పార్టీని వీడడంతో ఆయన స్థానంలో అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Simhadri Ramesh Babu to be ysrcp Machilipatnam mp candidate
Simhadri Ramesh Babu: మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ సూచనప్రాయంగా ప్రకటించారు. సోమవారం అవనిగడ్డలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ నన్ను ఎంపీగా పోటీ చేయమని చెప్పారు. పార్టీకి ఏది అవసరమైతే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జగన్ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా. జగన్ ఏది చెప్తే అది చేస్తా. చివరి వరకూ జగన్ వెంటే నా ప్రయాణమని అన్నారు. కాగా, సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీ వైపు మొగ్గుచూపిన సంగతి తెలిసిందే.
మారనున్న అవనిగడ్డ రాజకీయ ముఖచిత్రం
ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బందరు లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ఖరారైతే అవనిగడ్డ నుంచి సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ ను బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. కాగా, బందరు పార్లమెంటు స్థానానికి ముందుగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని పేరును వైసీపీ అధిష్టానం పరిశీలించింది. అయితే క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగడానికే ఆయన మొగ్గు చూపడంతో సింహాద్రి రమేశ్ పేరును అధిష్టానం ఓకే చేసినట్టు సమాచారం. రెండు రోజుల క్రితమే ఇదే విషయాన్ని 10టీవీ వెల్లడించింది.