తిరుమల లడ్డూ వివాదం.. జోరు పెంచిన సిట్, దర్యాఫ్తు ఎలా చేయనుందంటే..
ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతోంది, ఎవరెవరిని విచారించబోతోంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నది..

SIT Speedup Investigation (Photo Credit : Google)
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదంపై సమగ్ర దర్యాఫ్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం.. ఇవాళ పూర్తిగా చర్చించేందుకే పరిమితమైంది. ఇంకా ఫీల్డ్ విజిట్ ను స్టార్ట్ చెయ్యలేదు. నిన్న తిరుమల వచ్చిన సిట్ బృందం.. శ్రీవారిని దర్శించుకుంది. ఇవాళ తిరుపతి చేరుకుంది. మొత్తం 9 మంది సభ్యుల సిట్ బృందం తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యింది. ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి? ఎవరెవరిని విచారించాలి? ఏయే ప్లేసులకు వెళ్లాలి? బృందాలుగా ఎలా ఏర్పడలా? ఏయే బృందంలో ఎవరు ఉండాల? ఇలాంటి అనేక అంశాలపై సిట్ బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఈ బృందం అంతా కలిసి నేరుగా టీటీడీ ఈవో శ్యామలరావుని కలిసింది.
ఈ కేసు విషయంలో తాము ఎలా ముందుకు వెళ్లబోతోంది, ఎవరెవరిని విచారించబోతోంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం, కేసుని ఎలా చేధించబోతున్నాం.. ఇలా అనేక అంశాలపై సిట్ బృందం టీటీడీ ఈవోతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి టీటీడీ ఈవో శ్యామల రావు కూడా సిట్ బృందానికి కొన్ని కీలక విషయాలు, సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన తీరు, రిపోర్టులో ఏ విధంగా కల్తీ నెయ్యి ఘటన బయటపడింది, అంతకుముందు అసలేం జరిగింది? ఇప్పుడేం జరిగింది? ఇలా అనేక అంశాలకు సంబంధించి సిట్ బృందానికి కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత మళ్లీ సిట్ బృందం భేటీ అయ్యింది. రేపటి నుంచి ఫీల్డ్ విజిట్ కు దిగనుంది. మూడు బృందాలుగా సిట్ టీమ్ విడిపోబోతోంది. ఒక టీమ్ తిరుమల కొండపైన, మరొక టీమ్ తిరుపతిలోనే ఉండే అవకాశం ఉంది. టీటీడీ పరిపాలన భవనంలో కొన్ని కీలక పత్రాల సేకరణ, ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి పదార్దాలను నిల్వ చేసే గోడౌన్స్ లో తనిఖీలు చేయనుంది.
Also Read : తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ.. ఏం జరగనుంది, దేశవ్యాప్తంగా ఉత్కంఠ..
ఇంకో బృందం వీలైతే రేపు లేదా ఎల్లుండి టీటీడీకి కల్తీ నెయ్యి సప్లయ్ చేసినట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని దుండిగల్ లో ఉన్న ఏఆర్ డెయిరీ సంస్థకు వెళ్లనుందని సమాచారం. నెయ్యి తయారీలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు? నెయ్యి కల్తీకి అవకాశం ఉందా లేదా? అసలు ఆ సంస్థకు లైసెన్సులు ఉన్నాయా? పర్యావరణ అనుమతులు ఉన్నాయా? గుర్తింపు ఉందా లేదా? ఇలా అనేక అంశాల గురించి అక్కడికి వెళ్లి విచారించాలని సిట్ టీమ్ నిర్ణయించుకుంది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం ఆశిస్తోంది సిట్ టీమ్.
దాదాపు నాలుగైదు రోజులు భిన్న కోణాల్లో సిట్ ఇన్వెస్టిగేషన్ సాగబోతోంది. సిట్ చీఫ్ త్రిపాఠి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బృందాలుగా విడిపోయి, సమగ్రంగా దర్యాఫ్తు జరపబోతున్నామని, డిఫరెంట్ టీమ్స్ గా ఏర్పడి, డిఫరెంట్ ప్లేసులకు వెళ్లబోతున్నాం, చాలా డెప్త్ గా విచారణ చేయనున్నాం, విచారణ ప్రస్తుతం ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది, మరింత ముందుకెళ్తాం, ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందిస్తాం అని త్రిపాఠి వెల్లడించారు. మొత్తంగా రానున్న నాలుగైదు రోజుల్లో ఈ కేసులో దర్యాఫ్తు మరింత ముమ్మరంగా సాగబోతోంది.