ఏపీలోని పలు ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటన.. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు వేగవంతం

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లపై నివేదిక పంపడానికి సంఘటనా స్థలాన్ని సిట్ బృందం పరిశీలించింది.

ఏపీలోని పలు ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటన.. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు వేగవంతం

SIT Investigation

SIT team investigation : ఏపీలో ఎన్నికల తరువాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు 13మందితో కూడిన సిట్ బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ బృందం రెండు రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి విచారణ నిర్వహిస్తోంది. రెండోరోజు పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటించింది. మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో పర్యటించిన సిట్ బృందం .. కారంపూడి మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై, కారంపూడి పోలిస్ స్టేషన్ లో నమోదైన కేసులు, తదితర విషయాలపై స్థానిక సీఐ నారాయణ స్వామి నుంచి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీసింది.

Also Read : SIT On Poll Violence : ఏపీలో ఎన్నికల హింసపై 13మందితో సిట్ ఏర్పాటు.. సభ్యులు వీరే

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లపై నివేదిక పంపడానికి సంఘటనా స్థలాన్ని సిట్ బృందం పరిశీలించింది. మొదటగా పోలింగ్ రోజు ఓంశాంతి నగర్లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడి సంఘటన స్థలాన్ని సిట్ బృందం పరిశీలించి, వివరాలు సేకరించింది. పోలింగ్ మరుసటిరోజు టీడీపీ సీనియర్ నాయకుడు సూర్యముని నివాసం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడి సంఘటన స్థలాన్ని సిట్ బృందం పరిశీలించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల ముందర ఉన్న జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన రాళ్లదాడి సంఘటన స్థలానికి చేరుకొని అధికారుల నుంచి వివరాలను సిట్ బృందం సేకరించింది.

Also Read : SIT formation: సిట్‎లో ఎవరెవరు ఉంటారు?

తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి మండలం కూచువారి పల్లెలో సిట్ బృందం విచారణ నిర్వహించింది. టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి జరగడానికి ముందురోజు రాత్రి కూచువారిపల్లిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. పులివర్తి నానిపై దాడికి కారణం కూచువారిపల్లిలో జరిగిన గొడవలే కారణమని సిట్ భావిస్తుంది. గొడవపై కూచువారిపల్లిలో గ్రామస్తులను సిట్ బృందం సభ్యులు, డిఎస్పీ రవి మనోహర్ ఆచారి, సిఐ చంద్రశేఖర్లు విచారించారు. కూచువారిపల్లి లో ధ్వంసమైన వైసీపీ నేత కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించిన సిట్ బృందం… ఆ రాత్రి గొడవల్లో దగ్ధమైన వాహనాలను పరిశీలించింది. అదేవిధంగా నానిపై దాడి జరిగిన పద్మావతి యూనివర్శిటీ ప్రాంతాన్ని సిట్ బృందం పరిశీలించింది.

ఒంగోలు ఎసీబీ డీఎస్పీ శ్రీవాసరావు, మరో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ భూషణ్ నేతృత్వంలో సిట్ బృందం తాడిపత్రిలో పర్యటిస్తోంది. శనివారంరోజు రాత్రి తాడిపత్రికి చేరుకున్న సిట్ బృందం తాడిపత్రి పట్టణంలో ఘర్షణ జరిగిన పలుప్రాంతాలలో పర్యటించి విచారణ చేసింది. ఇవాళ ఉదయం నుంచి తాడిపత్రి రూరల్ పోలీస్టేషన్లో తాడిపత్రి ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను పరిశీలన చేస్తున్నారు. ఎవరిఎవరిపైన కేసులు నమోదు చేశారు. ఇంకా ఎవరిపైన అయినా కేసు నమోదు చేయాలాఅనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. అనంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటితోపాటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.