‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ.. మీ అకౌంట్లలో డబ్బులు జమకాకుంటే ఇలా చేయండి.. పథకానికి అర్హులు వీరే..
తల్లికి వందనం కింద నిధులు విడుదలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Talliki Vandanam funds released
Talliki Vandanam Scheme 2025: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైంది తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా వారికి ఏడాదికి రూ.15వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా.. ఈ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
తల్లికి వందనం కింద నిధులు విడుదలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం కింద విధివిధానాలు ఖరారు చేసింది. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు తల్లికి వందనం పథకానికి అర్హులు. ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అయితే, ఒక్కొక్క విద్యార్థికి రూ.15వేలు చొప్పున ప్రభుత్వం ఇవ్వనుండగా.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున జమ చేస్తుంది. ప్రతి విద్యార్థికి రూ.2వేల చొప్పున పాఠశాల మెయింటెనెన్స్ కింద జిల్లా కలెక్టర్ వద్ద ప్రభుత్వం జమ చేయనుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అమ్మ ఒడి పథకం కంటే తల్లికి వందనం పథకంలో 25లక్షల మందికి అదనంగా లబ్ధి కలుగుతుందని, గత ప్రభుత్వం కంటే రూ.2500 కోట్లు అదనంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని కూటమి ప్రభుత్వం తెలిపింది.
గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద లబ్దిదారుల వివరాల్ని నమోదు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ వివరాల్ని లెక్కలోకి తీసుకుంటోంది. అందువల్ల ఇవాళే అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని తెలుస్తోంది. ఒక వేళ ఇవాళ, రేపటిలోగా డబ్బు జమకాకపోతే అప్పుడు గ్రామ, లేదా వార్డు సచివాలయానికి వెళ్లి వివరాలు కోరవచ్చు. అలాగే కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్‌లో చేరే పిల్లల తల్లిదండ్రులు కూడా.. గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి తల్లికి వందనంకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరాలు కోరవచ్చు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
సూపర్ సిక్సులో అతికీలకం తల్లికి వందనం పథకం. ఇంట్లో ఒకరికి ఇచ్చి మిగిలిన వాళ్లకు ఇవ్వకపోవటం కరెక్ట్ కాదని భావించాం. అందుకే ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం సుమారు 42లక్షల మందికి అమ్మఒడి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సుమారు 67లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తల్లిదండ్రులు లేని పిల్లలకు గార్డియన్ ఖాతాలో వేస్తున్నాం. పారదర్శకత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా పెడతాం. ఏమైనా సాంకేతిక ఇబ్బందులుంటే దరఖాస్తు చేసుకోండి. ఈనెల 26వ తేదీ వరకు గడువు ఉంది. ఈనెల 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
తల్లికి వందనం కోసం కావాల్సిన పత్రాలు..
తల్లికి వందనం పథకం కింద ప్రయోజనం పొందే తల్లులు.. తప్పనిసరిగా కొన్ని పత్రాలు కలిగివుండాలి. అవేంటంటే.. ఆధార్ కార్డు (తల్లి, పిల్లల ఆధార్ కార్డులు), నివాస ధృవీకరణ పత్రం (రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు), ఆదాయ ధృవీకరణ పత్రం, పిల్లల జన్మ ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు (పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చెక్).
పథకంకు అర్హతలు ఇవే..
దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తల్లి అయి ఉండాలి. కనీసం ఒక స్కూల్ వయస్సు గల పిల్లవాడిని కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి. నమోదు చేసుకోని తల్లులు, పిల్లలూ వెంటనే గృహ డేటాబేస్ లలో నమోదు చేసుకోవాలి. ఇంట్లోని తల్లులు తమ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి కచ్చితంగా ఈ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి, ఎన్‌పీసీఐ తో లింక్ చేసి ఉండాలి.