Hari Rama Jogaiah : టీడీపీతో సమానంగా జనసేనకు పదవులు ఇవ్వాలి.. లేదంటే టీడీపీకే నష్టం: హరిరామ జోగయ్య
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికారం చేపట్టాలంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాల్సిందేనని సూచించారు. తన రాజకీయ అనుభవంతో చంద్రబాబుకు సలహా ఇస్తున్నానని హరి రామ జోగయ్య తెలిపారు.

Hari Rama Jogaiah
Hari Rama Jogaiah Letter : మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గురువారం లేఖ విడుదల చేశారు. ఎన్నికల సమయానికి 10 నెలలు గడువు ఉన్నా ఏపీలో ఎన్నికల వేడి మొదలైందన్నారు. చంద్రబాబు నాయుడు జిల్లాల వారి సభలు పెడుతున్నాడని తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ముందుకు దూసుకుపోతున్నాడని పేర్కొన్నారు.
వారాహి విజయ యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి అక్కడ సభలు పెడుతూ ఆకట్టుకుంటున్నాడని చెప్పారు. బీజేపీ చార్జ్ షీట్ ల పేరుతో ప్రజల వద్దకు వెళుతుందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికారం చేపట్టాలంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాల్సిందేనని సూచించారు.
తన రాజకీయ అనుభవంతో చంద్రబాబుకు సలహా ఇస్తున్నానని హరి రామ జోగయ్య తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు గాని, తర్వాత చేపట్టబోయే అధికారిక పదవులు గాని అన్నింటినీ సమానంగా పంచుకుంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. లేదంటే జనసేన కంటే టీడీపీనే ఎక్కువగా నష్టపోతుందని పేర్కొన్నారు. ఈసారి టీడీపీకి అధికార భాగస్వామ్యం లేకపోతే భవిష్యత్తు ఇబ్బందికరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.