టీడీపీ దూకుడు.. ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో గ్రామాల్లోకి!

అనుకోని పరిస్థితుల్లో తిరుపతి ఉపఎన్నికలు రాగా.. పార్లమెంటు స్థానానికి త్వరలో జరగబోయే ఎన్నికకు సంబంధించి సత్తా చాటాలని భావస్తోంది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ఆ పార్టీ.. ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో ప్రచారం ప్రారంభిస్తోంది. గెలుపే లక్ష్యంగా మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని సైతం ప్రకటించిన టీడీపీ, కేడర్ నుంచి లీడర్ వరకూ అందరిని రంగంలోకి దింపుతోంది.
ఈ క్రమంలోనే తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఈ ఎన్నిక కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు.. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో ప్రచారం ప్రారంభించాలని పార్టీ నేతలను ఆదేశించారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 700 గ్రామాల్లో పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో పార్టీకి చెందిన నేతలందరూ తప్పకుండా పాల్గొనాలని ఆదేశించారు అధినేత చంద్రబాబు. దేవాలయాలపై దాడులను హైలైట్ చేస్తూనే.. ఏడాదిన్నర జగన్ పాలనను ఎండగట్టాలని నేతలకు సూచించారు.
ఈ నెలాఖరు వరకు జరగబోయే యాత్రలో.. 70 ప్రత్యేక వాహనాల ద్వారా ప్రతి గ్రామాన్ని టచ్ చేయబోతున్నారు టీడీపీ నేతలు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించారు. బూత్, మండలం, అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలను ఐదంచెలుగా ఏర్పాటు చేసి కమిటీలు వేశారు. బూత్ స్థాయిలో 8 వేల మంది తెలుగుదేశం కార్యకర్తలను రంగంలోకి దింపారు. గ్రామ స్థాయిలో 1000 మంది తమ పని మొదలుపెట్టారు. మండల స్థాయిలో 40 మంది నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఓవరాల్‌గా మండల స్థాయిలో పరిస్థితులను బేరీజు వేసి సూచనలు ఇచ్చేందుకు 89 మంది పరిశీలకులను నియమించారు.
పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను పర్యవేక్షించేందుకు మాజీ మంత్రులు, పొలిట్‌బ్యూరో స్థాయి నేతలు, మాజీ ఎంపీలతో కూడిన 8 మందితో ఓ కమిటీ వేశారు. పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యవేక్షణకు ఆరుమందితో మరో కమిటీ నియమించారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని, బూత్ స్థాయి నుంచి ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసి, ఆయా కమిటీలకు బాధ్యతలు అప్పజెప్పారు.
రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతిలోనే మకాం వేసి దగ్గరుండి మరి పార్టీని ముందుకు నడిపిస్తుండగా… మరోవైపు తిరుపతి పార్లమెంట్ ఇంచార్జ్‌లతో చర్చిస్తున్నారు అధినేత చంద్రబాబు. ధర్మ పరిరక్షణ యాత్ర పూర్తయిన తర్వాత తిరుపతిలో భారీ బహిరంగ సభకు కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.