Disability Quota Row: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన టీడీపీ నేత.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

స్మితా సబర్వాల్ అనాలోచిత వ్యాఖ్యలను ఖండించాలి. చదివేస్తే వున్న మతిపోయినట్లు వుంది. స్మితా వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యం.

Disability Quota Row: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన టీడీపీ నేత.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

TDP Leader KS Jawahar Demands Apology from IAS Smita Sabharwal

KS Jawahar Comments on Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. ఆమె క్షమాపణ చెప్పాలని పలువురు దివ్యాంగులు, సీనియర్ అధికారులు డిమాండ్ చేశారు. బ్యూరోక్రాట్లకు ఫిజికల్ ఫిట్‌నెస్‌ కన్నా మెంటల్ ఫిట్‌నెస్‌ అవసరమని అభిప్రాయపడ్డారు. స్మితా సబర్వాల్ మానసిక స్థితి సరిగా లేదంటూ ఫైర్ అయ్యారు.

స్మితా సబర్వాల్ వివాదంపై తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి కెఎస్ జవహర్ రియాక్ట్ అయ్యారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పదవులో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు.

”స్మితా సబర్వాల్ అనాలోచిత వ్యాఖ్యలను ఖండించాలి. చదివేస్తే వున్న మతిపోయినట్లు వుంది. స్మితా వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యం. సమాజం పట్ల అవగాహన లేని వ్యాఖ్యలు. చివరకు రిజర్వేషన్లను తీసివేయాలని ఉద్యమం చేస్తారేమో? దివ్యాంగులపై ఇంత చులకన భావం ఎందుకు వచ్చింది.. దీని వెనుక ఎవరున్నారో చెప్పాలి. సమాజంలో వైషమ్యాలను పెంచాలనుకోవటం దుర్మార్గం. అంబేద్కర్ ఆలోచన, రాజ్యంగం పట్ల అవగాహన లేని వారు సివిల్ సర్వంట్లుగా పనికిరారు. స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పకపోతే ఊర్కోనేదిలేదు. స్మితా అహంకారం ఆమె వ్యాఖ్యల్లో కనపడుతుంది. ఇలాంటి అహంకారులకు బుద్దిచెప్పాల”ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Also Read : స్మిత సబర్వాల్ వాఖ్యలపై సీఎం రేవంత్ సహా కేసీఆర్, కేటీఆర్ తక్షణమే స్పందించాలి : బాలలత

ఎన్‌హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు
దివ్యాంగులకు రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్‌పై జాతీయ మానవ హక్కుల సంఘానికి తెలంగాణ కాంగ్రెస్ స‌స్పెండెడ్‌ లీడర్ బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో స్మితా సబర్వాల్‌పై శాంతి దివ్యాంగుల సంఘం నాయకురాలు శ్రీగిరి రజనీ కంప్లైంట్ ఇచ్చారు. కాగా, తన వ్యాఖ్యలను స్మితా సబర్వాల్‌ సమర్థించుకున్నారు.