తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత

  • Published By: murthy ,Published On : November 15, 2020 / 10:09 AM IST
తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత

Updated On : November 15, 2020 / 10:23 AM IST

tdp leader tanuku former mla passes away : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మరాజు (వైటీరాజా) కన్ను మూశారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. మూడు రోజుల క్రితం తిరిగి స్వల్ప అస్వస్ధతకు గురైన రాజా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్ పై చికిత్స పొందూతూ ఆదివారం తెల్లవారు ఝూమున కన్నుమూశారు.

అక్టోబర్ 24న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అప్పుడు స్ధానికంగా ఉన్న ఆస్పత్రిలోనూ, విజయవాడలోనూ చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ అస్వస్ధతకు గుర్యయారు. దీంతో నవంబర్ 12న మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో చేరారు. గత రెండు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆదివారం, నవంబర్ 15 తెల్లవారు ఝూమున ఆయన తుది శ్వాస విడిచారు.


వైటీ రాజా పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుంచి 1999 లో టీడీపీ తరుఫున ఎమ్మెల్యే గా గెలుపొంది సేవలందించారు. రాజా, ఆంధ్రా సుగర్స్ వ్యవస్ధాపకులు ముళ్లపూడి హరిశ్చంద్రరావు కి అల్లుడు, మేనల్లుడు. కాగా… వైటీ రాజా సోదరిని ప్రముఖ నిర్మాత సురేష్ ప్రోడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబుకు ఇచ్చి వివాహం చేశారు.

వై.టి. రాజా మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తణుకు ప్రాంత అభివృద్ధికి రాజా కృషి చేశారని…. శాసన సభ్యుడిగా ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. రాజా మృతి పశ్చిమగోదావరి జిల్లాకు, పార్టీకి తీరని లోటని అన్నారు. రాజా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.