మహా ఐతే ఓడిపోతాం.. అంతేగా: వర్ల రామయ్య

మహా ఐతే ఓడిపోతాం.. అంతేగా: వర్ల రామయ్య

Updated On : March 17, 2020 / 4:08 PM IST

పోలీసు శాఖ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వర్లరామయ్య ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీలో పొలిట్ బ్యూరో వరకూ వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు గానీ, ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం కానీ ఆయన సొంతం కాలేదు. ఎంపీగా పోటీ చేయడం, ఎమ్మెల్యేగా బరిలో నిలవడం.. ఆ తర్వాత నియోజకవర్గం వదిలేసి రావడం మినహా పెద్దగా వర్ల రామయ్య సాధించిందేమీ లేదు. పార్టీలో తురుపు ముక్కలా వర్లను ఉపయోగిస్తున్నారే తప్ప ఆయనకు పదవులు మాత్రం దక్కడం లేదనే వాదనలు ఉన్నాయి. 

గతంలో ఒకసారి రాజ్యసభ ఇస్తామని చెప్పి, వచ్చి బీ ఫాం తీసుకెళ్లమని చెప్పి… పిల్లాపాపలతో వచ్చిన వర్ల రామయ్యకు సీటు లేదు.. సారీ అని చెప్పి పంపిన పరిస్థితులు. ఈసారి గెలిచే అవకాశం లేకపోయినా వర్లను టీడీపీ రాజ్యసభకు నామినేషన్ వేయించడం విమర్శలకు అవకాశమిచ్చింది. తెలుగుదేశం పార్టీ తరఫున నోరున్న నాయకులలో వర్ల రామయ్య ఒకరు. మీడియాలో హడావుడి చేసే నేతగా ఆయనకు పేరుంది. ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం మినహా ఆయన సేవలకు తెలుగుదేశం చేసిన ప్రత్యుపకారం ఏమీ లేదనే చెప్పాలి. 

ప్రజల్లోంచి స్వయంగా ఓట్లు సాధించి నెగ్గే అవకాశాలు లేని నాయకుడిగా గుర్తింపు పొందిన వర్ల రెండుసార్లు ఎన్నికల బరిలోకి దిగి.. దారుణమైన పరాజయాల్ని మూటగట్టుకున్నారు. రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సీట్లు దక్కనున్నాయి. ఎమ్మెల్యేల కోటాలోనే ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభలో అడుగుపెడతారు. 

ఏపీ అసెంబ్లీలో 85 శాతం ఎమ్మెల్యేల బలంతో ఉన్న అధికార వైసీపీ మొత్తం నాలుగింటినీ సొంతం చేసుకోవడం ఖాయం. ఆ పార్టీ తరఫున నామినేషన్లు వేసిన నలుగురూ.. అప్పుడే ఎంపీలు అయిపోయినట్లుగా సెలబ్రేషన్ చేసేసుకున్నారు కూడా. కానీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్ల రామయ్యను తెరపైకి తీసుకొచ్చింది. సంఖ్యాపరంగా ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న తెలుగుదేశం.. ఆ బలంతో ఒక ఎంపీని గెలిపించుకోవడం అసాధ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ అనేది చేయకుండా ఉంటేనే మంచిది. కానీ పోటీ ఉండాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. 

వేరే వారు ఎవరూ పోటీకి నిలబడేది లేదని చెప్పడంతో వర్ల రామయ్యను ఎంపిక చేశారట. చంద్రబాబుకు అనుంగు శిష్యునిగా ఉండే వర్ల రామయ్య ఓటమి తప్పదని తెలిసినా పోటీకి సిద్ధపడ్డారని అంటున్నారు. దళిత వర్గానికి టికెట్ ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప అటు పార్టీకి గానీ.. ఇటు వర్ల రామయ్యకు గానీ ఏ మాత్రం ఉపయోగం లేదంటున్నారు. వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు ఈ ప్లాన్ చేసిన చంద్రబాబు.. దీని వల్ల ఎలాంటి మైలేజ్ను సాధించలేకపోయారు. 

గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే పార్టీ పరంగా ఎంతో కొంత తప్పకుండా ప్లస్ అయ్యి ఉండేదని అంటున్నారు. ఇప్పుడిచ్చి ఓ రకంగా విమర్శలను కోరి ఎదుర్కోవలసి వస్తోందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. గెలిచే అవకాశం లేకపోయినా వర్ల తనదైన శైలిలో పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని, చంద్రబాబును కొనియాడుతున్నారు.