పత్తా లేకుండాపోయిన పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు

పత్తా లేకుండాపోయిన పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు

Updated On : August 20, 2020 / 6:59 AM IST

ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువ ఎమ్మెల్యే పొజిషన్లు ఉండడంతో పాటు ఇక్కడి జనాలు పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మొత్తం ఆ పార్టీకే ఓట్లు వేస్తారని నమ్మకం నాయకుల్లో ఉంది. అంతే కాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఈ జిల్లాయే కీలకంగా నిలుస్తుంది. 15 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ గోదావరిలో జిల్లాలో 2014లో బీజేపీతో కలసి టీడీపీ మొత్తం స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. ఐదేళ్లు తిరిగే సరికి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు రెండు స్థానాలు మాత్రమే టీడీపీ సాధించింది.



ఈ జిల్లా మాకు కంచుకోట అని చెప్పుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్‌ అయిపోయారు. జిల్లా నాయకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అధినేత చంద్రబాబు వారితో బూస్టు తాగిద్దామని చూస్తున్నా ఒక్కరూ సిద్ధపడడం లేదంటున్నారు. ప్రస్తుతం జగన్‌తో పెట్టుకున్నా, ప్రభుత్వంతో పెట్టుకున్నా ఎలాంటి పరిస్థితితి వస్తుందో కళ్ల ముందే కనిపిస్తుండటంతో గత ప్రభుత్వంలో మంత్రులుగా ఒక వెలుగు వెలిగిన వారు, విప్‌లుగా చేసిన వారు కూడా ఇప్పుడు పార్టీతో తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారట.

జిల్లా నుంచి గతంలో మంత్రిగా చేసిన పితాని సత్యనారాయణ, జవహర్ ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కుని పితాని ఇప్పటికే గిలగిలలాడుతుంటే మరో మాజీ మంత్రి జవహర్ కూడా పూర్తిగా నోరు మెదపడం లేదంటున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అప్పుడప్పుడు డిబేట్లలో కనిపించినా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కొంతకాలం వరకూ మీడియా ముందు గట్టిగా మాట్లాడుతూ వచ్చిన జవహర్ కూడా ఇప్పుడు ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీనిని బట్టి చూస్తే ఈ మాష్టారు పాత లెక్కలను బయటకు తీస్తారనే భయంతో సైలెంట్ అయిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.



గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరైన నిమ్మల రామానాయుడు అడపాదడపా హడావుడి చేస్తున్నా ఆయనకు మద్దతుగా నిలిచే నాయకత్వమే జిల్లాలో లేకుండాపోయిందని అంటున్నారు. రామానాయుడు మాత్రం నియోజకవర్గంలో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తుండటం, ప్రొటోకాల్ నిబంధనలు కూడా పాటించడం లేదని బాధపడిపోతున్నారు. మరో ఎమ్మెల్యే మంతెన రామరాజు వైసీపీలోకి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. పార్టీ మారినా మారకపోయినా ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా తన వ్యాపారాలను చక్కబెట్టుకునే పనిలో ఉన్నారని జిల్లాలో వినిపిస్తున్న టాక్.

ఇక టీడీపీలో గాండ్రించే పులిగా ముద్ర పడిన మరో మాజీ ఎమ్మెల్యే చింతమనేని వరస కేసులతో, జైలు జీవితంతో కాస్త నెమ్మదించారట. గతంలో ఆయన దూకుడుకు అడ్డు ఉండేది కాదు. కానీ చింతమనేని ఇప్పుడు దూకుడుగా ఉండే తన కార్యకర్తలను కూడా సైలెంట్‌గా ఉండండిరా బాబు అని చెబుతున్నారట. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఉన్నా లేనట్టే అంటున్నారు. ఏ కార్యక్రమాల్లో కూడా కనిపించని పరిస్థితి. మరో మాజీ మంత్రి పీతల సూజాత అప్పుడుడప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు.



అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన సమయంలో నియోజకవర్గానికి, ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు ఎదుర్కొన్నా ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు పార్టీ అధ్యక్షున్ని వెనకేసుకొస్తూ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మీ కూడా రాజ్యసభ మాజీ సభ్యురాలు అయిపోవడంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలను నడిపించే నాయకుడు ప్రస్తుతం జిల్లా టీడీపీలో కనిపించడం లేదని కార్యకర్తలు ఫీలవుతున్నారు.

గతంలో జిల్లా నిండా మంత్రులు , ఎమ్మెల్యేలు, నాయకులతో పసుపు జెండా రెపరెపలాడిన చోట ఇప్పుడు జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో కొంత దగ్గరగా ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ ఓటమితో అయినా పార్టీ నేతల్లో మార్పు వస్తుందేమోనని ఆశ పడుతున్నారట.