ఆ టీడీపీ ఎంపీ ట్వీట్ పంచ్‌లు.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు

ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి యాక్టివ్‌గా ఉంటారు. ఆయన పంచ్‌లతో కూడిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంటాయి. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. సమావేశాలు, ప్రెస్‌మీట్లు పెట్టి కబుర్లు చెప్పడం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది ఆ ట్వీట్ సారాంశం.
ఇది ఎవరిని టార్గెట్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేశారా? కృష్ణా జిల్లా టీడీపీ నేత దేవినేని ఉమా, బుద్ధా వెంకన్నలను టార్గెట్ చేశారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అధినేతపై అసంతృప్తితో కేశనేని :
గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేశినేని ఆగ్రహంగా ఉన్నారు. కింది స్థాయిలో పని చేసే వారిని ప్రోత్సహించకుండా పార్టీ కార్యాలయంలో తమకు ఎదురుగా కనిపించి, షో వర్క్ చేసే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పార్టీ అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేశారు నాని.
పట్టాభిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రోత్సహించటం పట్ల కినుక వహించారట కేశినేని. కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో మొదటి నుంచి కేశినేనికి విభేదాలున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి దేవినేని ఉమ అంటే కేశినేనికి పడదు. ఓటమి అనంతరం కొన్నాళ్లు బుద్ధా వెంకన్నని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు నాని.
పార్టీ అధిష్టానమే నాని టార్గెట్ :
ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడటం కేశినేని నాని నైజం. సార్వత్రిక ఎన్నికల్లోపార్టీ ఓటమి తర్వాత బీజేపీకి ఆయన దగ్గరవుతున్నారనే ప్రచారం జరిగింది. పార్లమెంట్లో టీడీపీ విప్ పదవి ఇచ్చినా ఆయన నిరాకరించడం సంచలనంగా మారింది. గల్లా జయదేవ్‌కు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి కూడా నానిలో ఉందంటారు.
గల్లా జయదేవ్‌కి పార్లమెంటరీ పార్టీ లీడర్ పదవి, ఆయన తల్లి గల్లా అరుణకు పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఎలా అవకాశం ఇస్తారంటూ అధిష్టానాన్ని నాని ప్రశ్నించడం కూడా చర్చనీయాంశమైంది. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న కేశినేని మళ్లీ పార్టీ అధిష్టాన వర్గాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారంటున్నారు.
కుమార్తెను మేయర్ చేయాలని :
తన కుమార్తె కేశినేని శ్వేతను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ను చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు నాని. అనధికారికంగా కేశినేని శ్వేత టిడీపి మేయర్ అభ్యర్థిగా కొనసాగుతున్నారట. అప్పటి నుంచి కేశినేని కొంత సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కొంత సెట్ అయ్యారని అధిష్టానవర్గం భావించింది. ఇప్పుడు మళ్లీ టైం చూసుకుని గట్టి షాక్ ఇచ్చారు.
ముఖ్యంగా అమరావతి రాజధాని వ్యవహారంలో పార్టీ సరైన పంథాలో పోవడం లేదన్నది కేశినేని అభిప్రాయం. ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు చేయకుండా, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకుండా ఎంతసేపూ మీడియా సమావేశాల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో సొంత ప్రచారం చేసుకుంటున్నారని కేశినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరికి వారే యుమునా తీరే :
కరోనా కారణంగా ఈ మధ్యకాలంలో కేశినేని పెద్దగా బయటకు రావడం లేదు. టీడీపీ మేయర్ అభ్యర్ధిగా రంగంలో ఉన్న కేశినేని శ్వేత, గద్దె రామ్మోహన్‌తో కలసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తన కార్యాలయంలో ఉన్న విజయవాడ అర్బన్ పార్టీ కార్యాలయాన్ని ఆయనకు చెప్పకుండా మార్చివేయడం కూడా కేశినేని ఆగ్రహానికి కారణమంటున్నారు.
ఆ తర్వాత మళ్లీ కేశినేని ఆఫీసులోనే అర్బన్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో కొంత శాంతించారు. గ్రూపు రాజకీయాలకు కేంద్రంగా మారిన కృష్ణా జిల్లా టీడీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నా అధినేత పట్టించుకోవడం లేదనే వాదనలున్నాయి.
బుద్దా వెంకన్నపై విమర్శలు :
కేశినేని వ్యవహారం ఎటునుంచి ఎటు పోతుందో అని నేతలు నేతలు ఆందోళన చెందుతున్నారు. తాజా ట్వీట్‌తో సరిపెడతారా? మున్ముందు మరిన్ని ట్వీట్ల బాణాలు అధిష్టానంపై సంధిస్తారా అనే టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. గతంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాగుల్ మీరాకంటూ నాని ప్రకటించారు.
అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు. విజయవాడ పార్లమెంట్‌కి తనపై పోటీ చేసి ఓడిపోయిన పీవీపీని సైతం నాని విడిచిపెట్టలేదు. కేశినేని నానిని పార్టీలో అందరూ గౌరవిస్తారు. ఆయన అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అయినా ఎందుకు పార్టీని టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పార్టీ సీనియర్ నేతలు.