‘మహానాడు’పై టీడీపీ మల్లగుల్లాలు.. కారణం ఇదేనా?

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ ఏటా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకుని, మే నెలలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడుపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ మూడవ సారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లపాటు హైదరాబాద్‌లో నిర్వహించిన మహానాడు కార్యక్రమం… పరిపాలనను ఆంధ్రప్రదేశ్‌కు మార్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహిస్తున్నారు.
2016లో తిరుపతి, 2017లో విశాఖపట్నం, 2018లో విజయవాడలో మహానాడు కార్యక్రమంను టీడీపీ నిర్వహించగా.. 2019లో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహానాడు కార్యక్రమం ఎలా నిర్వహించాలి అనే విషయమై పార్టీ మల్లగుల్లాలు పడుతుంది.
ఈ విషయంపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ(14 మే 2019) సమావేశం జరిగింది. మంత్రులు నారా లోకేశ్, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ భేటీలో పాల్గొనగా.. మహానాడును మూడురోజుల పాటు నిర్వహించాలా? లేక ఒకరోజుకే పరిమతం చేయాలా? అనే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది.
మహానాడు నిర్వహణకు కోట్ల రూపాయల మేర ఖర్చవుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచీ కార్యకర్తలను తరలించడం, వారికి భోజన ఏర్పాట్లు, నివాస వసతి వంటి సౌకర్యాలను కల్పించడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నది ఈ క్రమంలో ఎన్నికల్లో ఫలితాలను బట్టి నాయకుల తీరు మారే అవకాశం ఉంది. అందుకే మహానాడు విషయంలో పార్టీ మల్లగుల్లాలు పడుతుంది.