కళ్లముందే కారు వాగులో కొట్టుకుపోయింది

  • Published By: bheemraj ,Published On : July 30, 2020 / 04:44 PM IST
కళ్లముందే కారు వాగులో కొట్టుకుపోయింది

Updated On : July 30, 2020 / 5:00 PM IST

అనంతపురం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఉధృతంగా గుత్తి వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. వరద నీటిలో చాలా దూరం వరకు కారు కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు కారుతోపాటు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కూడా కాపాడారు. ఇద్దరు కూడా తృటిలో ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గురువారం ఉదయం రాకేశ్, యాసూఫ్ కడప నుంచి కారులో బయలుదేరారు. 63 జాతీయ రహదారిపై రజాపురం వద్ద గుత్తి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కారులో వాగు దాటే ప్రయత్నం చేశారు. గుంతకల్ వైపు వెళ్తున్న కర్నాటకకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకాలే కారును వాగు దాటించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో బస్సు ఆవలి ఒడ్డుకు చేరుకోగా, కారు మధ్యలోనే ఆగిపోయింది. వరద ఉధృతికి కారు కొట్టుకు పోయింది. అక్కడే ఉన్న స్థానికులు స్పందించి కారులో కొట్టుకుపోతున్న ఇద్దరినీ కాపాడారు. కారు మాత్రం వాగులోనే కొట్టుకుపోయింది. కొంచెం ఉంటే వాగు ఉధృతికి బస్సు కూడా కొట్టుకుపోయేదని, తృటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

గుంతకల్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు రోజుల క్రితం వాగులో కొట్టుకుపోతున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు కాపాడారు. నిన్న బ్రిడ్జీ కింద నీటి కుంటలో మునిగి రెండు ఎద్దులు చనిపోయాయి. ఇవాళ ఉదృతంగా ప్రవహిస్తున్న గుత్తి చెరువు అలుగు పారుతున్న సమయంలో కడప నుంచి బళ్లారి వెళ్తున్న కారు ఆర్టీసీ బస్సు వెనకాలే వెళ్తోంది.

ప్రవాహలంలో వెళ్లొద్దని, నీటి గుంత ఎక్కువగా ప్రవహిస్తోంది..కొట్టుకుపోతారని స్థానికులు చెబుతున్నా వినకుండా నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వెళ్లడంతో వాగులో కొట్టుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు అక్కడే ఉండి కారులో ఉన్న ఇద్దరిని కూడా కాపాడారు. బాధితులు కడపకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

ఇటీవల వరుసగా వారం నుంచి కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మొన్న వాగులో కొట్టుకుపోతున్న ఇద్దరిని, ఇవాళ కారులో కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు.