ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నద్ధం…నేడు గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

  • Published By: bheemraj ,Published On : November 18, 2020 / 08:09 AM IST
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నద్ధం…నేడు గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

Updated On : November 18, 2020 / 10:36 AM IST

AP local body elections : ఏపీలో స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడు పెంచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఇవాళ ఆయన గవర్నర్‌ను కలవబోతున్నారు.



ఇవాళ ఉదయం 11.30కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ భేటీ కానున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై గవర్నర్‌కు ఎస్‌ఈసీ వివరించే అవకాశముంది. దీపావళి పండుగ ముందురోజు గవర్నర్‌తో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఏపీలోకరోనా కేసులు తగ్గాయని, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.



https://10tv.in/ap-cs-neelam-sahni-wrote-a-letter-to-state-election-commissioner-nimmagadda-ramesh/
మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అన్నారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయని… ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరమని ఆయన తెలిపారు.



ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లోలేదని.. ఎలక్షన్స్‌కు 4 వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ,నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎస్‌ఈసీ ప్రకటన ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయాన్ని మంత్రి కొడాలి నాని తప్పుపట్టారు. నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి జగన్‌ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను చూసి.. అధికారపార్టీ ఎన్నికలంటే భయపడుతోందన్నారు.

రాజ్యాంబద్ధ సంస్థల అధికారాలను సైతం వైసీపీ ప్రశ్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్దంగా ఉందన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ కంటిన్యూ అవుతోంది. వైసీపీ ఇప్పుడు ఎన్నికల వద్దంటోంటే.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం నిర్వహించాలని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో ఎస్‌ఈసీ భేటీ ఆసక్తి రేపుతోంది.