నిధుల విషయంలో మాట తప్పిన సర్కార్, సిబ్బంది కొరత ఉంది – నిమ్మగడ్డ

SES Nimmagadda Ramesh Kumar : ఎన్నికల నిర్వాహణలో అన్ని సవాళ్లను స్వీకరిస్తామని, ఏకగ్రీవ ఎన్నికలపై దృష్టి సారించామని..ఎస్ఈసీకి నిధుల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్. తమకు సిబ్బంది కొరత, నిధుల కొరత ఉందన్నారు. ఎన్నికల కమిషన్ లో ఉన్నది కొద్దిమంది సిబ్బందేనన్నారు. వాళ్ల మెరుగైన పనితీరుతో ఇక్కడిదాక వచ్చామన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు.
2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా..11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.
తమ కష్టాలన్నీ కోర్టుకు విన్నవించినట్లు, సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం జరిగిందన్నారు. కానీ..ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అందుకే గవర్నర్ ను కలిసి ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వాహణతోనే..గ్రామాల అభివృద్ధి సాధ్యమని..అప్పుడే విధులు, నిధులు సరిగ్గా ఉంటాయన్నారు. ఐజీ స్థాయి అధికారితో అక్రమాలు అరికట్టేలా ఎస్ఈసీ సమన్వయం ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వాహణ కమిషన్ కు పెద్ద సవాల్ లాంటిదన్నారు. అయినా..నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు నిమ్మగడ్డ