KTR Defamation Case: బండి సంజయ్‌పై రూ.10 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా..

10 కోట్ల పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించేలా ప్రచారాన్ని ఆపేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని వాదించారు.

KTR Defamation Case: బండి సంజయ్‌పై రూ.10 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా..

Updated On : September 15, 2025 / 10:34 PM IST

KTR Defamation Case: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బండి సంజయ్ తనపై అసత్యాలు, అసభ్యకరమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ తన పిటిషన్ లో తెలిపారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ వాదించారు.

ఆగస్ట్ 11న లీగల్ నోటీస్ పంపినప్పటికీ బండి సంజయ్ బేషరుతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో న్యాయపరమైన చర్య తప్ప మరే మార్గం లేకపోయిందని కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ తన పిటిషన్ లో కోరారు. 10 కోట్ల పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించేలా ప్రచారం చేయకుండా ఆపేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని వాదించారు. ఇప్పటికే ప్రసారమైన కంటెంట్ ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తక్షణమే తొలగించాలని కేటీఆర్ కోరారు. ఈ పిటిషన్ ను కోర్టు డిసెంబర్ 15న విచారించనుంది.

కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కేటీఆర్. బండి సంజయ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.

కేటీఆర్ పిటిషన్ లో కీలక అంశాలు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సందర్భంగా బండి సంజయ్ తన మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ చెప్పారు. బండి సంజయ్ మాట్లాడిన వీడియోలను కోర్టుకు సమర్పించారాయన. ఛానల్స్ లో ప్రసారమైన వీడియో లింకులను తొలగించాలని కేటీఆర్ కోర్టును కోరారు. బండి సంజయ్ మాట్లాడిన స్టేట్ మెంట్ ను లిఖితపూర్వకంగా 15 పేజీల్లో జతపరిచారు.

బండి సంజయ్ చేసిన ట్విట్టర్ పోస్టులు సైతం కోర్టుకు జతపరిచారు. గతంలోనూ అనేకసార్లు బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని చెప్పారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆగస్ట్ 13న బండి సంజయ్ కు లీగల్ నోటీసులు ఇచ్చానన్నారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో పేర్కొన్నానని తెలిపారు. ఇప్పటివరకు బండి సంజయ్ నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందన్నారు. ఆయనపై 10 కోట్ల కంటే ఎక్కువ దావా వేసినా తప్పులేదన్నారు. అసత్య ఆరోపణల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ తన పరువుకు భంగం కలిగిందన్నారు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్ లో కోరారు కేటీఆర్.

కేటీఆర్ పరువు నష్టం దావాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ఇజ్జత్ దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్న బండి సంజయ్.. న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తాను 9సార్లు జైలుకి వెళ్ళి వచ్చానని, తనపై వందకుపైగా కేసులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ మాదిరి ఇజ్జత్ దావాలు వేయాలంటే తాము అనేక కేసులు వేయవచ్చన్నారు. దీన్ని తాను రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పారు. బెదిరించేందుకు ఇజ్జత్ దావా వేయను అన్నారు. నేను లవంగం తింటే తంబాకు అన్నారని మండిపడ్డారు. దమ్ముంటే కుటుంబసభ్యులతో దేవుడు సన్నిధికి రావాలని సవాల్ విసిరాను, కేటీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.