Glue In Eyes: ప్రాంక్ పేరుతో పైశాచికం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలోకి గ్లూ.. 8మంది ఆసుపత్రి పాలు..

దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా ఉన్నారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును సస్పెండ్ చేశారు.

Glue In Eyes: ప్రాంక్ పేరుతో పైశాచికం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలోకి గ్లూ.. 8మంది ఆసుపత్రి పాలు..

Updated On : September 15, 2025 / 8:51 PM IST

Glue In Eyes: ఒడిశాలోని కందమాల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రాంక్ పేరుతో విద్యార్థులు పైశాచికంగా ప్రవర్తించారు. నిద్రిస్తున్న తోటి విద్యార్థుల కళ్లలోకి గ్లూ (జిగురు లాంటిది) వేశారు. దాంతో వారి కళ్లు మూసుకుపోయాయి.

కందమాల్ జిల్లా సలాగూడలో సేవాశ్రమ్ స్కూల్ లో ఈ దారుణం జరిగింది. రాత్రి పూట స్కూల్ విద్యార్థులు హాస్టల్ లో నిద్రపోతున్నారు. కొందరు సహ విద్యార్థులు తుంటరి పని చేశారు. నిద్రపోతున్న 8 మంది విద్యార్థుల కళ్లలోకి గ్లూ వేశారు. అంతే, దారుణం జరిగింది. పిల్లల కళ్లు మూసుకుపోయాయి. తీవ్రమైన నొప్పితో వారు విలవిలలాడారు. కళ్లు తెరవడానికి రాక భయంతో కేకలు వేశారు. పిల్లలు అరుపులు విన్న హాస్టల్ సిబ్బంది పరుగున వచ్చారు.

అక్కడ జరిగిన దారుణం చూసి షాక్ కి గురయ్యారు. కళ్లు తెరవక ఇబ్బంది పడుతున్న పిల్లలను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం పుల్బనీలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో 3, 4, 5వ తరగతికి చెందిన స్టూడెంట్స్ ఉన్నారు.

కళ్లు మూసుకుపోవడంతో విద్యార్థులు బాగా ఏడ్చారు. డాక్టర్లు ఎంతో జాగ్రత్తగా వారి కళ్లు తెరిచేందుకు ప్రయత్నం చేశారు. ఈ జిగురు వల్ల కంటికి తీవ్రమైన నష్టం కలిగిందని డాక్టర్లు తెలిపారు. అయితే సకాలంలో వైద్య సాయం అందిస్తే పిల్లలకు శాశ్వతంగా దృష్టి కోల్పోకుండా నిరోధించవచ్చన్నారు. చికిత్స అనంతరం ఒక విద్యార్థిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. మరో ఏడుగురు డాక్టర్ల పరిశీలనలో ఉన్నారు.

దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా ఉన్నారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును సస్పెండ్ చేశారు. అసలీ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు.

విషయం తెలిసిన వెంటనే జిల్లా శిశు సంక్షేమ అధికారి ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Also Read: బిగ్ అలర్ట్.. సరుకులు కొని పెట్టుకోండి.. జీఎస్టీ తగ్గినా రేట్లు రాకెట్‌లా దూసుకెళ్లనున్నాయ్.. కారణం ఇదే