సొంత దారే బెటర్ : పార్టీలను ధిక్కరిస్తున్న ఆ ముగ్గురు!

  • Published By: sreehari ,Published On : January 21, 2020 / 11:51 AM IST
సొంత దారే బెటర్ : పార్టీలను ధిక్కరిస్తున్న ఆ ముగ్గురు!

Updated On : January 21, 2020 / 11:51 AM IST

మూడు రాజధానుల వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు పెద్ద తలనొప్పిలా తయారైంది. ఈ తరుణంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి నిలిచింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ విప్‌ జారీ చేసింది. ఆ పార్టీకి చెందిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి మద్దతిస్తారనే ప్రచారం జరిగింది.

అయితే, ఓటింగ్‌ వాయిస్‌ ద్వారానే తీసుకుంటున్నందున వారిపై విప్‌ ధిక్కరణ పడే అవకాశాల్లేవు. మరోపక్క, జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక్క సభ్యుడు రాపాక వరప్రసాదరావు మాత్రం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా.. జగన్‌ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. ఇక మనోడు జంప్‌ అయిపోయినట్లే అని ఫిక్సయిపోతున్నారట.

అందుకే ఇలా చేశారా? :
అసెంబ్లీలో రాపాకకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మూడు రాజధానుల అంశానికి తన మద్దతు తెలిపారు. నిజానికి అంతకు ముందే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ రాపాకకు ఒక లేఖ రాశారు. అసెంబ్లీలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ, ఇవేవీ రాపాక పట్టించుకోలేదు.

పార్టీకి ఒకే ఒక్క సభ్యుడు ఉన్నందున తన పదవి పోతుందన్న భయం కూడా లేదు. తాను మాత్రమే ఉన్నందున ఫిరాయింపు చట్టం కూడా వర్తించే అవకాశం లేదు. దీంతో ఆయన ప్రభుత్వానికి మద్దతుగానే మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే జగన్‌ పక్కన కూర్చొని కాసేపు ముచ్చటించారు. ఈ విషయంలో ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశం అయ్యింది.

మరోపక్క తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన వల్లభనేని వంశీకి ఇప్పటికే స్పీకర్‌ ప్రత్యేకంగా సీటు కేటాయించారు. వాస్తవానికి పార్టీ నుంచి బహిష్కరిస్తేనే చట్టప్రకారంగా విప్‌ చెల్లదు. కానీ, సస్పెన్షన్‌లో మాత్రమే ఉన్నందున విప్‌ను పాటించాల్సిందే. ఇక, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు.

కానీ, తెలుగుదేశం సభ్యుడైనందున విప్‌ ఆయనకు వర్తిస్తుంది. కాబట్టి ఓటింగ్‌లో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందే. కాకపోతే, వాయిస్‌ ఓటింగ్‌ మాత్రమే నిర్వహించడంతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇదంతా చూసిన జనాలు మాత్రం ఔరా.. ఇవేమీ రాజకీయాలు అని ముక్కున వేలేసుకుంటున్నారు.