Simhachalam Temple Incident: నాసిరకంగా గోడ నిర్మించడం వల్లే ప్రమాదం..!- సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిషన్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
వారం పది రోజుల వ్యవధిలోనే గోడ నిర్మాణం జరిగింది. చందనోత్సవం కోసం తాత్కాలికంగా గోడ నిర్మాణం చేసినట్లు చెబుతున్నారు.

Simhachalam Temple Incident: సింహాచలం దేవస్థానంలో ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిషన్ చైర్మన్ సురేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిరకంగా గోడ నిర్మించడం వల్లే ప్రమాదం జరిగినట్లు కనిపించిందన్నారు. దేవస్థానంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర ప్రజలను కలిచివేసిందన్నారు. ఈరోజు దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులు, చందనోత్సవంకు ఏర్పాట్లు చేసిన అధికారులను, కాంట్రాక్టర్ ను విచారించామని సురేశ్ కుమార్ వెల్లడించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి శాంపుల్స్ ను సేకరించామన్నారు.
”వారం పది రోజుల వ్యవధిలోనే గోడ నిర్మాణం జరిగింది. చందనోత్సవం కోసం తాత్కాలికంగా గోడ నిర్మాణం చేసినట్లు చెబుతున్నారు. టెంపుల్ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుకూలంగా జరిగిందా లేదా అనేది నిర్ధారిస్తాం. కాంట్రాక్టర్ తో పాటు అనుమతి ఇచ్చిన అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తి చేసి మూడు రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిస్తాము. వైఫల్యాలు, లోపాలు, సూచనలతో నెల రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తాం” అని త్రిసభ్య కమిషన్ ఛైర్మన్ సురేశ్ కుమార్ చెప్పారు.
Also Read: ప్రజలకు ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఇక చంద్రబాబు పరిస్థితి ఏంటో- జగన్ కీలక వ్యాఖ్యలు
సింహాచలం నరసింహస్వామి చందనోత్సవం సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున గోడ కూలి ఘోరం జరిగిపోయింది. అప్పన్న చందనోత్సవానికి ఏడుగురు భక్తులు మృతి చెందారు. సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రమాద ఘటనపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.