Ys Jagan: ప్రజలకు ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఇక చంద్రబాబు పరిస్థితి ఏంటో- జగన్ కీలక వ్యాఖ్యలు

రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నారు.

Ys Jagan: ప్రజలకు ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఇక చంద్రబాబు పరిస్థితి ఏంటో- జగన్ కీలక వ్యాఖ్యలు

Updated On : May 1, 2025 / 5:58 PM IST

Ys Jagan: ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో ఇంత దారుణమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయన్న జగన్.. కూటమి ప్రభుత్వంలో అధిక రేట్లకు ఇసుకు అమ్ముతున్నా ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదన్నారు. ఏ గ్రామంలో చూసినా గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే కనిపిస్తున్నాయన్నారు. ఏ నియోజకవర్గంలో అయినా మైన్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాల్సిందేనని ఆయన ఆరోపించారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా నడుస్తోందన్నారు.

”రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ గ్రూపులకు అడ్డగోలుగా భూములు కేటాయిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశారు. జ్యుడీషియల్ రివ్యూ తీసేశారు. కొత్తగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది” అని ధ్వజమెత్తారు జగన్.

కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాల్టీకి చెందిన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పరిపాలనపై జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Also Read: గంటా, విష్ణుకుమార్ రాజు మధ్య వివాదానికి కారణమేంటి? కూటమిలోనే ఉంటున్నా వీరి మధ్య విభేదాలెందుకు?

”ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్ బాల్ తన్నినట్లు తంతారు. ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.

ఇంతకుముందు మన హయాంలో కార్యకర్తల కోసం అనుకున్న విధంగా మనం చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లాంటి మహమ్మూరి వల్ల, ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద, పాలన మీద దృష్టి పెట్టి నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నా. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తా. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి” అని పార్టీ కార్యకర్తలు, నేతలతో అన్నారు జగన్.