తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్డేట్స్‌ మీద అప్డేట్స్.. ఈ ఆధారాలతో ఇరికిపోయేదెవరు?

నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా సంస్థ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్లను కూడా సిట్ విచారిస్తోంది.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్డేట్స్‌ మీద అప్డేట్స్.. ఈ ఆధారాలతో ఇరికిపోయేదెవరు?

TTD

Updated On : November 12, 2025 / 9:46 PM IST

Tirumala ghee scam: ఏడాది కింద ఏపీ పాలిటిక్స్‌ను ఓ ఊపు ఊపేసింది శ్రీవారి లడ్డూ ఇష్యూ. నేషనల్ టాపిక్‌ అయి రచ్చరంబోలా అయింది. శ్రీవారి చుట్టూ పెద్ద కాంట్రవర్సీ కొనసాగింది. అప్పటి ప్రభుత్వంలోని నేతలకు, టీటీడీ పాలకులకు కల్తీ నెయ్యి మరకలు అంటాల్సినదానికంటే ఎక్కువే అంటాయి. ఆ తర్వాత కల్తీ నెయ్యి వివాదం ఒక్కసారిగా చల్లబడి..ఇప్పుడు మళ్లీ అదేస్థాయిలో ఇష్యూ తెరమీదకు వచ్చింది.

స్పెషల్‌ సిట్‌ దర్యాప్తులో కీలక అప్డేట్స్‌తో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది కల్తీ నెయ్యి కేసు. ఇప్పటికే సిట్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను అరెస్ట్‌ చేసింది. ఇక టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని కూడా సిట్‌ విచారించింది. లేటెస్ట్‌గా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ నుంచి పిలుపు వచ్చింది. సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా, లడ్డూ ప్రసాదం తయారీకి ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీకి టీటీడీ నెయ్యి అనుమతిలిచ్చింది.

ఆ సంస్థ 2019-24 మధ్య ఐదేళ్ల పాటు నెయ్యి సరఫరా చేయగా, ఒక్క లీటర్ కూడా నాణ్యమైన స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయలేదని సిట్ భావిస్తోందట. ఈ మధ్యే కోర్టుకు రిపోర్ట్‌ సమర్పించిన సిట్‌ అప్పట్లో టీటీడీలో కీలక బాధ్యతల్లో ఉన్నవారికి వరుసగా నోటీసులిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించారు. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది.

Also Read: స్థానిక సమరానికి కాంగ్రెస్‌ సర్కార్‌ సై అంటోందా? జూబ్లీహిల్స్‌లో గెలిస్తే లోకల్‌ ఫైట్‌కు ఇలా..

వైసీపీ అధినేత జగన్‌కు బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డి గత ప్రభుత్వంలో దాదాపు నాలుగేళ్లపాటు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన హయాంలోనే భోలేబాబా డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశమై విచారణకు ఆదేశించగా సిట్ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురి పాత్ర ఉందని భావించి అరెస్టులు చేసింది. ఇందులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రైవేటు పీఏగా చిన్న అప్పన్నను కొద్దిరోజుల క్రితం అరెస్టు చేసింది.

ఇక వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్‌ హైకోర్టుకు కొద్దిరోజుల క్రితం నివేదిక ఇచ్చింది. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌, భోలేబాబా డెయిరీలు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలినప్పటికీ..సుబ్బారెడ్డి అప్పట్లో ఆ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆ తర్వాత కూడా ఆ సంస్థలను ఆయన అనుమతించారని సిట్ తన పిటిషన్‌లో వివరించింది. వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలపై అనుమానం ఉన్నందున వారి బ్యాంకు ఖాతాల వివరాలు కోరుతున్నట్లు కోర్టుకు ఇచ్చిన నివేదికలో మెన్షన్ చేసింది సిట్.

సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటూ సిట్ నోటీసులు

ఈ పరిస్థితుల్లో సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటూ సిట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించిన సిట్..మరోవైపు సుబ్బారెడ్డికి నోటీసులివ్వడంతో దర్యాప్తు పీక్ లెవల్‌కు చేరినట్లుగా భావిస్తున్నారు. కాగా, సిట్ నోటీసులు అందుకున్న సుబ్బారెడ్డి ఈ నెల 13న లేదా 15న విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చినట్లు చెబుతున్నారు.

నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా సంస్థ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్లను కూడా సిట్ విచారిస్తోంది. రెండు బృందాలుగా విడిపోయి సిట్ టీమ్‌..బోలే బోలే బాబా సంస్థ డైరెక్టర్లను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 జూలైలో కల్తీ నెయ్యి కేసు మొదలైంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని..ఆ మాటకొస్తే అది నెయ్యే కాదని స్పెషల్ సిట్‌ కోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. చిన్న అప్పన్న అరెస్టుతో తర్వాత నెక్స్‌ ఏం జరగబోతుందనేది టెన్షన్ మొదలైంది. వైవీ సుబ్బారెడ్డికి కూడా సిట్‌ నోటీసులు ఇవ్వడంతో కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కేవలం అరెస్టయిన నిందితులకే పరిమితం కాకుండా, టీటీడీలోని కొందరు వ్యక్తుల ప్రమేయంపైనా సిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంతా ఒక ఎత్తు అయితే..అసలు ఎపిసోడ్‌ ఇప్పుడే స్టార్ట్‌ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది. ధర్మారెడ్డి విచారణ..వైవీ సుబ్బారెడ్డికి పిలుపు..అంతకంటే ముందే అప్పన్న అరెస్ట్‌తో వాట్‌ నెక్స్ట్‌ అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డితో పాటు ఈవో ధర్మారెడ్డిని కూడా విచారించడం అయిపోతే..కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో కన్‌ఫ్యూజన్స్‌ వీడుతాయని అంటున్నారు. త్వరలోనే అసలు సూత్రధారులుగా భావిస్తున్నవారికి ఉచ్చు బిగుసుకోబోతోందని లీకులు బయటికి వస్తున్నాయి. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం..రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.