Tirumala Rains: తిరుమలలో భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ అలర్ట్.. ఆ మార్గాల్లో రాకపోకలు నిలిపివేత
భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Tirumala Rains
Tirumala Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలాఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా 22కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతుంది. అయితే, ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పోర్టుల వద్ద ఒకటో నంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
వాయుగుండం తీరం దాటడంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమూ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తిరుపతి జిల్లాతోపాటు తిరుమల కొండపైనా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా బుధవారం రెండో ఘాట్ రోడ్డులోని 15వ మైలు వద్ద, భాష్యకార్ల సన్నిధికి సమీపంలో, హరిణి వద్ద కొండచరియలు విగిపడ్డాయి. వాటిని టీటీడీ ఘాట్ రోడ్డు భద్రత, ఇంజనీరింగ్ సిబ్బంది తొలగించి రాకపోకలను పునరుద్దరించారు.
భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కొండచరియలపై ప్రత్యేక నిఘా ఉంచిన.. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ సిబ్బందిని ఈవో ఆదేశించారు. పాప వినాశనం, శిలాతోరణం మార్గాలు ఇప్పటికే మూసివేయగా.. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్లు మార్గాన్ని గురువారం రాత్రి వరకు మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.