దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలపై తిరుమల లడ్డూ ఎఫెక్ట్.. కీలక ఆదేశాలు జారీ..
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థపై దాడులు చేశారు. దిండిగల్ లోని ఏఆర్ డెయిరీలోని పాలు, నెయ్యి ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు.

Ttd Laddu Row : దేశంలోని ఆలయాలపై తిరుమల లడ్డూ ఎఫెక్ట్ పడింది. ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రంగంలోకి దిగాయి. ప్రసాదాల తయారీని, అందులో వాడే పదార్ధాలపై నజర్ పెట్టాయి. ఆలయాల్లో ఆకస్మిక దాడులు చేసి ప్రసాదాల నాణ్యతను పరిశీలిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాష్ట్రంలోని ఆలయాల్లో సమర్పించే ప్రసాదం నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రసాదం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపనుంది. రాజస్తాన్ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఇందుకోసం ప్రత్యేకంగా శుద్ధ్ ఆహార్, మలీవత్ పర్ వార్ అనే క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజూ ప్రసాదం తయారు చేసే పెద్ద పెద్ద ఆలయాల్లోనూ విచారణ జరపనున్నట్లు ఆహార భద్రత విభాగపు అదనపు కమిషనర్ తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో 54 ఆలయాలు ఇప్పటివరకు సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతను పరీక్షించడంతో పాటు పరిశుభ్రతను కూడా పరిక్షీస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కూడా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్నాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశాలు ఇచ్చింది. కర్నాటకలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను తరుచూ పరిశీలన జరుపుతామన్నారు. ఇక తమిళనాడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థపై దాడులు చేశారు. దిండిగల్ లోని ఏఆర్ డెయిరీలోని పాలు, నెయ్యి ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. అలాగే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు.
Also Read : తిరుమల లడ్డూకి అంత రుచి ఎలా వస్తుంది? అందులో ఏయే పదార్థాలు వాడతారు? దాని చరిత్ర ఏంటి?
ఇటు ఏపీ ప్రభుత్వం కూడా తిరుమలతో పాటు ఇతర ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల ప్రసాదాల నాణ్యతను పరిశీలిస్తున్నారు. తాజాగా సింహాచలం దేవస్థానం ప్రసాదాల నాణ్యతపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరుకుల కొనుగోళ్లు, ప్రసాదాల తయారీ, ఇతర రికార్డులను పరిశీలించారు.