తిరుమలలో తలనీలాలు సమర్పించే కేంద్రాలు మూసివేత

రెండు నెలలకు పైగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలు మొదలు కానున్నాయి. కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేసిన తరువాత తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుని దర్శించుకునేందుకు భక్తులకు జూన్ 8వ తేదీ నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం ట్రయల్ రన్ జరిగింది. కొంతమంది టీటీడీ ఉద్యోగులు భౌతిక దూరాన్ని పాటిస్తూ, స్వామిని దర్శించుకున్నారు.
ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ ఉదయం 100 మంది ఉద్యోగులకు స్వామి దర్శనం చేయించి, గంటకు ఎంత మందిని పంపించవచ్చన్న అంశాన్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు. 8గంటల నుంచి 10గంటల వరకూ స్థానికులు, ఇతర ఉద్యోగులతో ట్రయల్ రన్ కొనసాగుతుందని, ప్రతి రోజు 7 వేల మంది వరకూ దర్శనం కల్పించ వచ్చని ప్రాథమికంగా నిర్థారించినట్లు చెప్పారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు ఉంటాయని, టీటీడీ విధానాలను భక్తులు పాటించాలని సూచనలు చేశారు. తిరుమలలో తలనీలాలను సమర్పించే కేంద్రాలను మాత్రం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మరో నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
అన్న ప్రసాద కేంద్రం వద్ద ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి, తీర్థం, చటారిలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలకు ఎంట్రీ లేదని, కంటైన్మెంట్, రెడ్ జోన్ల పరిధిలో ఉన్న భక్తులకు అనుమతి లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
Read: కొండపై కండీషన్స్ : శ్రీ వారి దర్శనం 11వ తేదీ నుంచి..రోజుకు 3 వేల మందికి మాత్రమే