తిరుమల శ్రీవారి దర్శనంలో మార్పులు.. నేటి నుంచి కొత్త రూల్స్.. భక్తులు తప్పకుండా తెలుసుకోండి..

తిరుమల శ్రీవాణి దర్శనంలో టీటీడీ మార్పులు చేసింది. ఇక నుంచి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పించనుంది.

తిరుమల శ్రీవారి దర్శనంలో మార్పులు.. నేటి నుంచి కొత్త రూల్స్.. భక్తులు తప్పకుండా తెలుసుకోండి..

Tirumala

Updated On : August 1, 2025 / 10:04 AM IST

TTD: తిరుమల శ్రీవాణి దర్శనంలో టీటీడీ మార్పులు చేసింది. ఇక నుంచి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పించనుంది. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవాణి బ్రేక్ దర్శనంకు టికెట్లు పొందిన వారిని దర్శనానికి అనుమతించనున్నారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను టీటీడీ పరిశీలించనుంది.

ఉదయం ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ పొందిన భక్తులు.. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. ప్రస్తుత విధానంతో సదరు శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా మూడు రోజుల సమయం పట్టేది.

ఇదిలాఉంటే.. శ్రీవాణి టికెట్ల జారీలో ఎలాంటి మార్పు లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమ‌ల‌లో ఉద‌యం 10 గంట‌ల నుండి మొద‌ట‌ వ‌చ్చిన వారికి మొద‌టి ప్రాతిప‌దిక‌న ఆఫ్‌లై‌న్‌లో టికెట్ల‌ జారీ చేయనున్నారు. ఎప్పటిలాగానే 800 టికెట్లు జారీ చేస్తారు. టికెట్లు పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వ‌ద్ద అదేరోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు రిపోర్టింగ్ స‌మ‌యం ఉంటుంది. రేణిగుంట విమానాశ్ర‌యంలో ఉద‌యం 7 గంట‌ల నుండి ద‌ర్శ‌న టికెట్లు కోటా ఉన్నంతవరకు జారీ చేస్తారు. అక్కడ 200 టికెట్లను టీటీడీ జారీ చేయనుంది.

ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో శ్రీ‌వాణి టికెట్లు పొందిన భ‌క్తుల‌కు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఉంటుంది. న‌వంబ‌ర్ 1వ తేదీ నుండి శ్రీ‌వాణి టికెట్ల‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ముందుగా కౌంట‌ర్ల వ‌ద్ద‌కు చేరుకుని ఇబ్బంది ప‌డ‌కుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేయు కౌంటర్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ తెలిపింది. నూతన విధానంతో భక్తులకు వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించనుంది.