డేంజర్ లో ట్రంప్ హెల్త్?.. చేతిపై మచ్చ, కాళ్ల వాపు.. అవసరమైతే అధ్యక్ష పగ్గాలు చేపడతానంటున్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఏం జరుగుతోంది?
డొనాల్డ్ ట్రంప్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్నవేళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Trump health
Trump health : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ట్రంప్‌నకు 79ఏళ్లు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంకు ట్రంప్ అనారోగ్యంతో (Trump health) బాధపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే, వైట్‌హౌస్ వైద్యుల బృందం మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తుంది.
Also Read: US Tariffs : ట్రంప్‌నకు బిగ్ షాకిచ్చిన అమెరికా కోర్టు.. టారిఫ్‌ల మోతపై ఆగ్రహం.. హద్దులు మీరారంటూ..
ట్రంప్‌నకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. కానీ, కొంతకాలంగా ఆయన్ను దగ్గరి నుంచి గమనిస్తున్న కొందరు.. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేసమయంలో ట్రంప్ చేతిపై పెద్ద మచ్చ ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగా పుతిన్‌ను ఆహ్వానించే సమయంలో ట్రంప్ కార్పెట్ పై నేరుగా కాకుండా కాస్త తూలుతున్నట్లుగా అటూఇటూ నడిచారని కొందరు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో.. ట్రంప్ కుడిచేతిపై పెద్ద మచ్చను ప్రస్తావిస్తున్నారు.
ట్రంప్‌ను కొంతకాలంగా దగ్గర నుంచి చూస్తున్న వారు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కాలి చీలమండల వద్ద వాపు, కుడిచేతి వెనకాల కమిలి పోయినట్లుగా వంకాయ రంగులో పెద్ద మచ్చ, ఉబ్బిపోయిన కళ్లు, రంగుమారిపోయిన పెదవులు, నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుండటం వంటి వాటిని ప్రస్తావిస్తున్నారు. ఇవి తీవ్రమైన గుండె వ్యాధి, దానికి వాడే మందుల దుష్ప్రభావాల లక్షణాలని విశ్లేషిస్తున్నారు.
ట్రంప్ కుడిచేతిపై పెద్దటి మచ్చ గురించి చర్చజరుగుతున్న వేళ.. వైట్‌హౌస్ వైద్యుడు సియాన్ బార్బబెల్లా వివరణ ఇచ్చారు. రక్తాన్ని పలుచన చేసే ఆస్ప్రిన్ ను ట్రంప్ వాడుతున్నాడని, ఇటీవల చాలా మందిని కలిసి కరచాలనం చేయడంతో చర్మం రాపిడికి గురై మచ్చ ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ వయస్సు 79ఏళ్లు. ఈ వయస్సులో ఇలాంటి సమస్యలు సర్వసాధారణమేనని.. అయితే, తీవ్రమైన గుండె, రక్తనాళాల వ్యాధులేమీ లేవని సియాన్ పేర్కొన్నారు.
జెడి వాన్స్ వ్యాఖ్యలపై దుమారం..
డొనాల్డ్ ట్రంప్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్నవేళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవేళ అనుకోని విషాదం ఏమైనా జరిగితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వాన్స్ ప్రకటించారు. అయితే, ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతానికి చాలా బాగుందని చెప్పారు. ఆయన తన పూర్తి పదవీకాలం బాధ్యతలు నిర్వర్తిస్తారని తాను విశ్వసిస్తున్నట్లు వాన్స్ పేర్కొన్నారు. ట్రంప్ అనారోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు జెడి వాన్స్ అలా మాట్లాడారని కొందరు పేర్కొంటుండగా.. ట్రంప్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడని.. త్వరలో తానే అధ్యక్షుడిని అవుతాననే విషయాన్ని ముందుగానే వాన్స్ బహిర్గతం చేశాడంటూ మరికొందరు భావిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో జెడి వాన్స్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.